
రామజన్మభూమిలో నిర్మించబోయే రామాలయానికి సంబంధించిన భూమిపూజా కార్యక్రమాలను దూరదర్శన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఆగస్టు 5న జరిగే ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు.
రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపిన వివరాల ప్రకారం రామాలయ భూమి పూజా కార్యక్రమాలన్నింటినీ దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రసారం చేయనుంది. అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూపించేందుకు ఇతర ఛానళ్లు కూడా సన్నాహాలు చేస్తున్నాయన్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా అయోధ్యకు ప్రజలు తరలిరావద్దని రాయ్ విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి, రామాలయ భూమి పూజను చూడాలని, పండుగను జరుపుకోవాలని ఆయన కోరారు. ఆగస్టు 5న భారతదేశంలోని రామభక్తులు, సాధువులు తాము ఉంటున్న ప్రదేశంలోనే పూజలు చేస్తారని రాయ్ చెప్పారు.
ఇలా ఉండగా, అయోధ్యలో రామాలయం నిర్మాణం రాళ్లతోనే చేస్తామని ఆలయ నిర్మాణ వర్కు షాప్ సూపర్ వైజర్ అనూభాయ్ సోంపూర వెల్లడించారు. రామాలయం నిర్మాణంలో ఇనుము, ఉక్కు వినియోగించమని ఆయన స్పష్టం చేశారు.
తాను 30 ఏళ్లుగా అయోధ్యలోని ఆలయ నిర్మాణ వర్కు షాప్ సూపర్ వైజరుగా పనిచేస్తున్నానని అనూభాయ్ చెప్పారు. ఇప్పటికే కొన్నిరాళ్లు నిర్మాణ స్థలంలో ఉన్నాయని, మరిన్ని రాళ్లు రాజస్థాన్ నుంచి తెప్పిస్తామని ఆయన చెప్పారు.
సాధారణ రాళ్లు తెప్పించి ఇక్కడ ఉన్న రెండు యంత్రాల సాయంతో కట్ చేస్తామని చెప్పారు. ఆలయ నిర్మాణానికి చెక్కలు, రాగి, తెల్ల సిమెంటు వినియోగిస్తామని అనూభాయ్ చెప్పారు. ఆలయంతో పాటు హనుమాన్ గర్హి మందిరాన్ని కూడా రాళ్లతోనే నిర్మిస్తామని మహంత్ రాజుదాస్ చెప్పారు.
More Stories
రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష.. అనర్హత వేటు తప్పదా!
నకిలీ వార్తలు సమాజానికి ప్రమాదకరం
అట్టహాసంగా పద్మ అవార్డుల ప్రధానోత్సవం