నేను బీజేపీలో ఉన్నాను, బీజేపీతోనే ఉంటాను

తాను బీజేపీకి గుడ్‌బై చెప్పి, తిరిగి తృణమూల్ గూటికి చేరుతున్నారంటూ వస్తున్న వార్తలను సీనియర్ నేత ముకుల్ రాయ్ తీవ్రంగా ఖండించారు. ఆ పుకార్లు అత్యంత హానికరమైనవని, తప్పుదోవ పట్టించేవని మండిపడ్డారు.

‘‘నేను బీజేపీలో ఉన్నాను. బీజేపీతోనే ఉంటాను”   అని స్పష్టం చేశారు.  బెంగాల్‌లో జరిగే స్థానిక సంస్థల, పార్లమెంటరీ ఎన్నికల పూర్తి బాధ్యతలను బీజేపీ అధిష్ఠానం తన భుజ స్కంధాలపై మోపిందని ప్రకటించారు. “బీజేపీ అధిష్ఠానం నాకు పూర్తి మర్యాద, గౌరవం ఇస్తోంది. నేనెందుకు నిరాశ చెందుతాను?’’ అని ఎదురు ప్రశ్నించారు.

బెంగాల్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దిలీప్ ఘోష్‌తో తనకు ఎలాంటి భేదాభిప్రాయాలూ లేవని స్పష్టం చేశారు. బీజేపీలో సంఘటన కోసమే అందరూ పని చేస్తుంటారని, ఎవరి స్వేచ్ఛ వారికుంటుందని, అయితే అందరూ ఒకే లక్ష్యం కోసం పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు.

ఎడిటర్, డిప్యూటీ ఎడిటర్ మధ్య భేదాభిప్రాయాలున్నట్లు పార్టీలో భేదాభిప్రాయాలు ఉండవని, బీజేపీ మీడియా హౌస్ కాదని ఎద్దేవా చేశారు. అయితే బెంగాల్‌లో ఇన్ని సీట్లు సాధించి పెట్టినా కేంద్ర మంత్రి పదవి దక్కకపోవడంను ప్రస్తావిస్తూ తనకు మంత్రి పదవులు అక్కర్లేదని, పార్టీ సంఘటన పైనే పూర్తి దృష్టి నిలిపానని వెల్లడించారు.

‘‘కేంద్ర మంత్రి  పదవి దక్కడం నాకంతా ముఖ్యమైనదేమీ కాదు. కార్యక్షేత్రంలో సంఘటన కోసం కృషి చేసిన వ్యక్తిని. సంఘటన కోసమే పనిచేస్తాను.’’ అని ముకుల్ రాయ్ స్పష్టం చేశారు.

మరోవైపు ఈ అంశంపై బెంగాల్ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జీ, జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాస్ వర్గీయ కూడా స్పందించారు. ఆ పుకార్లలో ఏమాత్రం వాస్తవం లేదని వర్గీయ కొట్టిపారేశారు. తమ  పార్టీకి ముకుల్ రాయ్ చాలా కీలకమై నేత అని ఆయన పేర్కొన్నారు. ఈ పుకార్లన్నీ కూడా అధికార పక్షమైన తృణమూల్ చేస్తున్న పుకార్లని వర్గీయ ఆరోపించారు.