నాటకీయ పరిణామాల నేపథ్యంలో చివరకు రాజస్థాన్ అసెంబ్లీ సమావేశం జరపడానికి గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా సుముఖత వ్యక్తం చేశారు. జులై 31 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేసిన గెహ్లాత్ ప్రభుత్వ ప్రతిపాదనను వివరణలను ఉదయం కోరిన గవర్నర్ కొద్దీ సేపటికే అసెంబ్లీసమావేశంపై తాను జాప్యం చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలను ఖండించారు.
ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ తాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి ఈ విషయంలో జోక్యం చేసుకోమని కోరినట్లు ప్రకటించగానే రాజ్ భవన్ నుండి ఈ ప్రకటన వచ్చింది. పై నుండి వస్తున్న వత్తిడిల కారణంగా గవర్నర్ జాప్యం చేస్తున్నారని అంటూ అంతకు ముందు ముఖ్యమంత్రి ఆరోపించారు.
మహమ్మారి కరోనా వ్యాప్తిపై చర్చ, రాష్ట్ర ఆర్థిక స్థితి, అత్యవసరంగా చేపట్టాల్సిన బిల్లులు తదితర అంశాలపై చర్చించేందుకు అసెంబ్లీని సమావేశపరచాలంటూ ముఖ్యమంత్రి తొలుత విజ్ఞప్తి చేశారు.
ఇక అనర్హత వేటుకు గురైన సచిన్ పైలట్ వర్గానికి ఊరట కలిగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాజస్తాన్ స్పీకర్ సీపీ జోషి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.
అసెంబ్లీ భేటీ కోరుతూ శుక్రవారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన ధర్నా అనంతరం, ఆరు అంశాల్లో ప్రభుత్వం నుంచి గవర్నర్ వివరణ కోరారు. పూర్తి వివరాలతో మళ్లీ ప్రతిపాదనలు పంపాలని సీఎంకు చెప్పారు. అదే విధంగా మెజారిటీ ఉన్నప్పుడు మళ్లీ నిరూపించుకోవాల్సిన అవసరమేంటని గవర్నర్ ప్రశ్నించారు.
దాంతో శనివారం మళ్లీ సమావేశమైన కేబినెట్ ఈనెల 31 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాల్సిందిగా కొత్త ప్రతిపాదన పంపినప్పటికీ గవర్నర్ నుండి సానుకూల స్పందన లేకపోవడంతో ముఖ్యమంత్రి అసహనానికి గురయ్యారు. గవర్నర్ తీరుపై గెహ్లాత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీకి ఫిర్యాదు చేశారు.
మోదీకి స్వయంగా ఫోన్ చేసి గెహ్లాత్ మంత్రివర్గ తీర్మానానికి వ్యతిరేకంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీని ద్వారా రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని, ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వ జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించి, ప్రభుత్వాన్ని కాపాడాలని కోరారు.
మరోవంక, అసెంబ్లీలో అశోక్ గహ్లోత్ సర్కార్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని బీఎస్పీ ఎమ్మెల్యేలను కోరుతూ పార్టీ అధినేత్రి మాయావతి జారీ చేసిన విప్ ఆసక్తికరంగా మారింది. బీఎస్పీ తరపున ఎన్నికైన ఆరుగురు ఎమ్మెల్యేలతో కూడిన ఆ పార్టీ శాసనసభాపక్షం 2019 సెప్టెంబర్‌లో కాంగ్రెస్‌లో విలీనమైంది. ఈ విలీనానికి రాజస్తాన్ అసెంబ్లీ స్పీకర్ ఆమోదముద్ర వేశారు.
More Stories
త్వరలో జనగణన… ఆ తర్వాతే కులగణనపై నిర్ణయం!
ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా అతిశీ
కోల్‌కతా పోలీస్ కమిషనర్‌పై వేటుకు మమతా సమ్మతి