వైసీపీ ప్రభుత్వానికి కూడా ఇసుక దెబ్బ  

గత ప్రభుత్వానికి మాదిరిగానే వైసీపీ ప్రభుత్వానికి కూడా ఇసుక దెబ్బ తగలడం ఖాయమని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు. గతఏడాది నుంచి ఇసుక సరిగ్గా దొరకడంలేదని, ఇసుక మాఫియా ఎక్కువైపోయిందని ధ్వజమెత్తారు.  

‘‘రాష్ట్రంలో ఇసుక ఒక అందని ద్రాక్షగా మారిపోయింది. అందనంత దూరంలోకి వెళ్లిపోయింది. అర్ధరాత్రి ఎప్పుడో ఆన్‌లైన్లో ఇసుక బుకింగ్‌ ఓపెన్‌ చేసి రెండు నిమిషాల్లోనే క్లోజ్‌ చేస్తున్నారు. అసలు ఇసుక ఎవరికి వెళ్తుందో కూడా తెలియడంలేదు. ఇదేవిధంగా జరిగితే టీడీపీకి తగిలినట్లే వైసీపీకీ ఇసుకదెబ్బ తగిలి తీరుతుంది’’ అని ఆయన స్పష్టం చేశారు. 

‘‘భవన నిర్మాణ కార్మికులకు ఇసుక ఒక ముడిసరుకు. అలాంటిది రాజమహేంద్రవరంలో బయటపడిన శిరోముండనం కేసును చూస్తే ఇసుక లారీ అంత వేగంగా రావాల్సిన అవసరం ఏముంది? అంటే ఏదో తప్పు చేస్తున్నట్టే. ఇసుక స్మగ్లింగ్‌కు ఆ ప్రాంతం ఆలవాలమని చెబుతున్నారు”  అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 

ప్రజలు తమ సమస్యలను చెప్పుకొనే అవకాశమూ ఈ ప్రభుత్వం ఇవ్వడంలేదని విమర్శించారు. కరోనా వల్ల పలు రంగాల్లో ఉపాధి దెబ్బతిన్నదని చెబుతూ వాటి పై ప్రభుత్వం దృష్టిపెట్టాలని హితవు చెప్పారు. 

జగన్ ప్రభుత్వం రాగానే మొత్తంగానే ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు తీసివేయడం పట్ల పవన్ కళ్యాణ్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఒక్క కాపులకు మాత్రమే కాకుండా అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరికీ రిజర్వేషన్లను ప్రభుత్వం ఇవ్వాల్సిందే అని స్పష్టం చేశారు.

మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎంతో ఆలోచించి ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు (ఈడబ్ల్యూఎస్‌) 10శాతం రిజర్వేషన్‌ కేటాయించే విధంగా చట్టం చేసిందని గుర్తు చేశారు.  ఈ చట్టాన్ని దేశం మొత్తం హర్షించిందని, స్థానికంగా దీని అమలు బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించిందని తెలిపారు. అయితే టీడీపీ ప్రభుత్వం ఈ రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు కేటాయించిందని చెప్పారు.

‘‘లాక్‌డౌన్‌, కరోనా వ్యాప్తి మూలంగా భిన్న వర్గాల ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు అండనిచ్చే ప్యాకేజీ ఆత్మ నిర్భర్‌ భారత్‌. ప్రయోజనం పొందే పలువర్గాల ప్రజలు మోదీకి చేతులెత్తి నమస్కరిస్తున్నారు” అని కొనియాడారు. 

ముంబై తాజ్‌ హోటల్‌, పార్లమెంటు భవనంపై దాడి ఘటనలు చూసినప్పుడు బలమైన నాయకత్వం లేదేంటీ అని నాకు తనకు అనిపించేదని పేర్కొన్నారు. అప్పుడు తనకు మోదీ కనిపించారని చెబుతూ ఆయన తీసుకొనే కొన్ని నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యంగా  ఉండక పోయినా అవి ఇచ్చే దీర్ఘకాల ప్రయోజనాలను చూస్తే ప్రశంసించకుండా ఉండలేమని స్పష్టం చేశారు. 

ఎన్నో అగ్రరాజ్యాల మద్దతు కూడగట్టుకుని ఆర్థికంగా, మిలటరీపరంగా బలమైన చైనా దేశాన్ని, దాని దుందుడుకుతనాన్ని నిలువరించడం పెద్ద విజయని పవన్ ప్రధానిని ప్రశంసించారు.

 

కరోనాకాలంలో తొందరపడి సినిమా షూటింగ్‌లు చేసుకున్నా కష్టమేనని హితవు చెప్పారు. ఆ మధ్యన కొంతమంది రెండు రాష్ట్రాల సీఎంలను కలిసి షూటింగ్‌లకు అనుమతి పొందినా షూటింగ్‌ చేసే పరిస్థితులు లేవని గుర్తు చేశారు. కరోనా, లాక్‌డౌన్‌ సమయంలో జనసైనికులు బాగా సేవ చేశారని అంటూ పార్టీ నిర్మాణం నిరంతర ప్రక్రియ అని తెలిపారు.