
ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం తహసిల్థార్ కార్యాలయాల చుట్టూ ఇక తిరగాల్సిన అవసరం లేదు. ఈ దిశలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. బియ్యం కార్డు ఇక నుండి ఇన్‌కమ్‌సర్టిఫికేట్‌గా పనిచేస్తుంది. వారు ప్రత్యేకంగా ఆదాయాన్ని ధృవీకరిస్తూ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం లేదు.
ఆ కార్డే వారి ఆదాయానికి కొలమానంగా పనిచేస్తుంది. దానిని చూపి, ఇన్‌కమ్‌సర్టిఫికేట్ ద్వారా పొందే ప్రయోజనాలన్నింటిని వారు పొందవవచ్చు. బియ్యంకార్డు లేని ఇతరులు ఆదాయ ధృవీకరణ పత్రాన్ని ప్రతి ఏడాది తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి తీసుకుంటే దానిని నాలుగుసంవత్సరాల పాటు వినియోగించుకోవచ్చు.
ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ సచివాలయంలోని ఐదవ బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు శాఖ మంత్రిగా శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఈ రెండు అంశాలకు సంబంధించిన ఫైలుపై తొలి సంతకం చేశారు.
ఆ తరువాత బియ్యం కార్డును ఇన్‌కమ్ సర్టిఫికేట్‌గా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జిఓఎంఎస్ నెంబర్ 205ను కూడా విడుదల చేసింది. రెవెన్యూశాఖలో ఉన్న సమర్ధవంతమైన అధికారుల సహకారంతో పారదర్శకమైన సేవలందిస్తామని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. అర్హులైన వారికి ఆగస్టు 15న 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి దాదాపు ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలిపారు.
రెవెన్యూ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రెవెన్యూ శాఖలో ఉన్న దీర్ఘకాలిక సమస్యలకు సత్వర పరిష్కార మార్గాలు చూపాలని మంత్రి ధర్మాన అధికారులను ఆదేశించారు. తగాదాల పరిష్కారానికి ప్రభుత్వం త్వరలో భూ రీసర్వే చేపట్టనుందని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి డిప్యూటీ సిఎం దృష్టికి తీసుకొచ్చారు. మాన్యువల్‌లో ఉన్న భూ రికార్డులను కంప్యూటీకరణ చేస్తున్నామని సిసిఎల్‌ఎ జాయింట్ సెక్రటరీ సిహెచ్ శ్రీధర్ తెలిపారు.
More Stories
అసెంబ్లీకి దొంగల్లా వచ్చి వెళ్లడం ఏంటి?
ఎపి ప్రభుత్వ సలహాదారులుగా సతీష్‌రెడ్డి, సుచిత్ర ఎల్ల
టీటీడీ నిధుల మళ్లింపుపై హైకోర్టు ఆగ్రహం