విశాఖలో చిన్నపిల్లల అక్రమ రవాణా గుట్టురట్టు

విశాఖలో చిన్నపిల్లల అక్రమ రవాణా గుట్టురట్టు
విశాఖ కేంద్రంగా జరుగుతున్న చిన్నపిల్లల విక్రయ వ్యవహారం బయటపడింది. ఐసిడిఎస్‌ పిఒ ఫిర్యాదుతో గుట్టురట్టయింది. విశాఖ నగరంలోని జిల్లా పరిషత్తు రోడ్డులో ఉన్న యూనివర్సల్‌ సృష్టి ఆస్పత్రి ఎమ్‌డి నమ్రత ఆధ్వర్యంలో ఈ వ్యవహారం జరిగినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో పోలీసులు మొత్తం ఆరుగురిని అరెస్టు చేశారు.

విశాఖ నగర పోలీసు కమిషనర్‌ ఆర్‌కె.మీనా ఆదివారం మీడియాకు కథనం ప్రకారం జిల్లాలోని వి.మాడుగులకు చెందిన మహిళ వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తోంది. ఆమె భర్త చనిపోవడంతో వివాహేతర సంబంధంతో గర్భం దాల్చింది. అదే గ్రామానికి చెందిన ఆశా కార్యకర్త కె.వెంకటలక్ష్మి ద్వారా యూనివర్సల్‌ సృష్టి ఆస్పత్రిలో చేరి ఈ ఏడాది మార్చి తొమ్మిదిన మగబిడ్డకు జన్మనిచ్చింది.
 
ఆ బిడ్డను కోల్‌కత్తాకు చెందిన రారు కుటుంబానికి విక్రయించారు. ఆ తర్వాత సదరు మహిళ గ్రామంలో కనిపించకపోవడంతో అంగన్‌వాడీ టీచర్‌ సరోజిని ఐసిడిఎస్‌ సిడిపిఒకు విషయం తెలియజేసింది. దీంతో, చైల్డ్‌ ప్రొటెక్షన్‌ బృందం రంగంలోకి దిగి గత మార్చిలోనే కోల్‌కత్తా నుంచి బేబీని తీసుకొచ్చి ఆస్పత్రిలో ఉంచింది. 
 
అనంతరం స్థానిక శిశు సంరక్షణ గృహానికి ఆ బేబీని అప్పగించింది. ఐసిడిఎస్‌ పిఒ ఈ నెల 24న చేసిన ఫిర్యాదు మహారాణిపేట పోలీసులు కేసు విచారణ చేపట్టారు. యూనివర్సల్‌ సృష్టి ఆస్పత్రి ఎమ్‌డి పచ్చిపాల నమ్రతతోపాటు ఆశా కార్యకర్తలు కె.వెంకటలక్ష్మి, బి.అన్నపూర్ణ, ఏజెంట్‌ ఎ.రామకృష్ణ, ఆస్పత్రిలో పని చేస్తున్న డాక్టర్‌ తిరుమల, ఎల్‌.చంద్రమోహన్‌లను అరెస్టు చేశారు. 
 
బేబీని కొనుగోలు చేసిన కోల్‌కత్తాకు చెందిన దంపతులను త్వరలో అరెస్టు చేస్తామని సిపి తెలిపారు. యూనివర్సల్‌ సృష్టి ఆస్పతి పేరుతో గతంలో సష్టి ఆస్పత్రి అని ఉండేదని, 2010లో విశాఖ టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్లో, 2013లో గుంటూరు జిల్లా కొత్తపేట పోలీస్‌ స్టేషన్లో ఈ ఆస్పత్రిపై 420 కేసులు నమోదైందని చెప్పారు. 
 
ఈ నేపథ్యంలో యూనివర్సల్‌ సృష్టి హాస్పిటల్‌గా పేరు మార్చుకొని చిన్నారుల అక్రమ రవాణా చేస్తున్నట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర, ఒడిశా ప్రాంతాల్లో ఏజెంట్లను నియమించి వివాహేతర సంబంధాలతో గర్భం దాల్చిన వారిని ప్రోత్సహించి ఈ ఆస్పత్రిలో పురుడు పోసిన అనంతరం ఆ బేబీలను హైదరాబాద్‌, విజయవాడ, కోల్‌కత్తా, భువనేశ్వర్‌ వంటి ప్రాంతాల వారికి విక్రయిస్తున్నారని సిపి మీనా తెలిపారు.