జాక్‌ మాకి గుర్గావ్‌ కోర్టు సమన్లు  

జాక్‌ మాకి గుర్గావ్‌ కోర్టు సమన్లు  

చైనాకు చెందిన వ్యాపార కంపెనీ అలీబాబా గ్రూప్‌, దాని వ్యవస్థాపకుడు జాక్‌ మాకి గుర్గావ్‌ కోర్టు సమన్లు జారీ చేసింది. ఆ కంపెనీ మాజీ ఉద్యోగి చేసిన ఫిర్యాదు మేరకు నోటీసులు జారీ చేశారు. అలీబాబా గ్రూప్‌కు చెందిన యూసీ వెబ్‌లో గతంలో పనిచేసిన పుష్పేంద్ర సింగ్‌ పర్మార్‌‌ అనే వ్యక్తి పిటిషన్‌ వేశారు. 

యూసీ బ్రౌజర్‌‌, యూసీ న్యూస్‌లో తప్పుడు వార్తలు వస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. 2 వేల నోట్లు రద్దు, భారత్‌ – పాక్‌ మధ్య యుద్ధం అంటూ తప్పుడు ప్రచారం చేసింది కూడా యూసీ న్యూస్‌ అని ఆయన వేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు.

అంతే కాకుండా భారత్  – చైనా సరిహద్దులో నెలకొన్న పరిస్థితులపై కూడా వచ్చిన వార్తలను సెన్సార్‌‌ చేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో పిటిషన్‌ను స్వీకరించిన జిల్లా సివిల్‌ జడ్జి అలీబాబా కంపెనీకి నోటీసులు జారీ చేశారు.

నెల రోజుల్లో రాతపూర్తక సమాధానం ఇవ్వాలని, ఈ నెల 29న నేరుగా లేదా లాయర్‌‌ ద్వారా కోర్టులో హాజరు కావాలని ఆదేశించారు. భారత్‌ – చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో మన దేశం చైనాకు చెందిన 59 యాప్‌లను నిషేధించింది. యూసీ బ్రౌజర్‌‌, యూసీ న్యూస్‌ కూడా వాటిలో ఒకటి. దీంతో ఇప్పుడు దానిపై పిటిషన్‌ దాఖలు కావడం చర్చనీయాంశమైంది.