అమెరికా నుండి మరో 8ఐ విమానాలు 

చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో త్రివిధ దళాలను అన్నిరకాలుగా సన్నద్ధం చేసే చర్యలను భారత ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఇటీవల భారీగా ఆయుధాలు, విమానాలు, హెలికాప్టర్లు కొనుగోలు చేస్తున్న మోదీ ప్రభుత్వం, తాజాగా మరో భారీ డీల్‌కు సిద్ధమైంది. 
 
అత్యాధునిక పొసీడన్‌ 8ఐ విమానాల కొనుగోలుకోసం అమెరికా ప్రభుత్వంతో త్వరలోనే ఒప్పందం కుదర్చుకోనుంది. భారత నౌకాదళం వద్ద ఇప్పటికే ఎనిమిది పీ-8ఐ విమానాలున్నాయి.  ఈ విమానాల్లో అత్యాధుని రాడార్లు, ఎలక్ట్రో ఆప్టికల్‌ సెన్సార్లు ఉంటాయి. 
 
అంతేకాకుండా హార్పూన్‌ బ్లాక్‌ 2 క్షిపణులు, ఎంకే-54 తేలికపాటి టార్పెడోలు కూడా ఉంటాయి. భూ, సముద్ర నిఘాకు ఈ విమానాలు ఉపయోగపడుతాయి. 2009 జనవరిలో కుదిరిన ఒప్పందం ప్రకారం 2.1 బిలియన్‌ డాలర్లతో భారత నేవీ 8 విమానాలు కొనుగోలు చేసింది. 2016లో మరో నాలుగు విమానాల కోసం ఒప్పందం చేసుకుంది.
తాజాగా అత్యవసరంగా మరో ఆరు విమానాలకు ఆర్డర్‌ ఇవ్వనున్నట్టు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. వీటితోపాటు ఆరు ప్రిడేటర్‌ సముద్ర రక్షణ డ్రోన్లను కూడా కొనుగోలు చేయనున్నట్టు తెలిపాయి.