ఇక రూ.400లకే కరోనా పరీక్షలు!

అతి తక్కువ ఖర్చుతో మహమ్మారి కరోనా వైరస్‌ను నిర్ధారించే పరికరాన్ని ఐఐటీ ఖరగ్‌పూర్‌ ప్రకటించింది. తమ శాస్త్రవేత్తలు తయారు చేసిన పోర్టబుల్‌ ర్యాపిడ్‌ డయాగ్నోస్టిక్‌ పరికరంతో ఒక్కో టెస్టుకు కేవలం రూ.400 మాత్రమే ఖర్చవుతుందని తెలిపింది. అంతేకాదు.. గంటలో ఫలితం తేలిపోతుందని పేర్కొంది.
 
భారీ ఖర్చుతో కూడుకున్న ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలకు ఇది ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందని పరికరం తయారు చేసిన శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షల్లోలాగే.. కచ్చితమైన ఫలితం ఈ పోర్టబుల్‌ ర్యాపిడ్‌ డయాగ్నోస్టిక్‌ పరికరంలో ఉందని తెలిపింది. 
 
రూ.2000 ధర కలిగిన తమ పోర్టబుల్‌ ర్యాపిడ్‌ డయాగ్నోస్టిక్‌ పరికరంతో వైరస్‌ ఉనికి తెలుసుకోవటం చాలా సులభమని పేర్కొన్నారు.  ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని పరీక్ష విధానాల ధరల కంటే ఇదే అతి తక్కువ అని శాస్త్రవేత్తలు తెలిపారు. పోర్టబుల్‌ ర్యాపిడ్‌ డయాగ్నోస్టిక్‌ పరికరం తయారీ, వ్యాపార పరమైన అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఈ ధర నిర్ణయించామని తెలిపారు.
 
కరోనా నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన ఇదో గొప్ప ముందడుగని ఈ పరికరం తయారీలో కఅషి చేసిన ఐఐటీ ఖరగ్‌పూర్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విభాగం ప్రొఫెసర్‌ సుమన్‌ చక్రవర్తి, స్కూల్‌ ఆఫ్‌ బయో సైన్స్‌ విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ అరిందమ్‌ మోండల్‌ తెలిపారు.