గణేశ్‌ నిమజ్జనానికి విసర్జన్‌ చార్జీలు  

గణేశ్‌ నిమజ్జన వ్యర్థాలను తొలిగించేందుకు విసర్జన్‌ చార్జీలు వసూలుచేయాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) స్పష్టంచేసింది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను విడుదలచేసింది. వీటిని రాష్ట్రాల బోర్డులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించింది. 
 
నిమజ్జనం సందర్భంగా పీసీబీ వాచ్‌డాగ్‌గా వ్యవహరించాలని ఆదేశించింది. లక్ష జనాభా మించిన టైర్‌ -1 నగరాల్లో పీసీబీ అధికారులు పర్యవేక్షణ జరుపాలని సూచించింది. ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ (పీవోపీ), థర్మాకోల్‌, ప్లాస్టిక్‌ వాడకంపై పూర్తిగా నిషేధం విధించింది.

సీపీసీబీ మార్గదర్శకాలు

  • నిమజ్జన కొలనులను శుభ్రం చేయడానికి, శానిటైజేషన్‌ కోసం, వ్యర్థాలు తొలిగించేందుకు విసర్జన్‌ చార్జీలను వసూలుచేయాలి.
  • విగ్రహాల నిమజ్జనానికి తాత్కాలికంగా నిమజ్జన కొలనులను ఏర్పాటుచేసుకోవాలి. విగ్రహాలను నిమజ్జనం చేశాక వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలిగించాలి.
  • విగ్రహాలతోపాటు వచ్చే పూజా సామగ్రి, పూలవంటి వాటిని ముందుగానే తొలిగించి, కేవలం విగ్రహాలను మాత్రమే నిమజ్జనంచేయాలి.
  • నవరాత్రుల్లో భాగంగా సింగిల్‌ యూజ్డ్‌ ప్లాస్టిక్‌ వాడకం పూర్తిగా నిషిద్ధం. ఎకో ఫ్రెండ్లీ వస్తు సామగ్రిని మాత్రమే వినియోగించాలి.
  • విగ్రహాలను సహజ రంగులతోనే అలంకరించాలి. ఎండిన ఆకులు, పూలు, బెరడులతో తయారుచేసిన రంగులనే వినియోగించాలి.
  • కాలుష్య తీరుతెన్నులను పర్యవేక్షించేందుకు పీసీబీ అధికారులు నిమజ్జనానికి ముందు, నిమజ్జన మూడో, ఐదో, ఏడో, తొమ్మిది రోజుల్లో నిమజ్జన కొలనుల్లో నీటి నాణ్యతా పరీక్షలను నిర్వహించాలి.