పోతిరెడ్డుపై మీ విధానం ఏమిటి కేసీఆర్? 

పోతిరెడ్డుపై మీ విధానం ఏమిటి కేసీఆర్? 
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమంగా సామర్ధ్యం పెంచుతున్న పోతిరెడ్డిపాడుపై మీ విధానం ఏమిటో చెప్పాలని  ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును మాజీ మంత్రి, బిజెపి నేత డి కె అరుణ డిమాండ్ చేశారు. సెంటిమెంట్ పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలను ఇంకెంతకాలం మోసం చేస్తారని ఆమె కేసీఆర్ ను ప్రశ్నించారు. 
 
పోతిరెడ్డిపాడు పై సుప్రీంకోర్టులో తేల్చుకుంటాం అన్న కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆమె విస్మయం వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై జగన్ కు కేసీఆర్ కు ముందే లోపాయికారి ఒప్పందం కుదరడం నిజం కాదా ?. అంటూ ఆమె నిలదీశారు. పాలమూరు ప్రజలను ఇంకెంతకాలం మోసం చేస్తార‌‌ని ఆమె అడిగారు. 
 
ఏపీ ప్ర‌భుత్వం పోతిరెడ్డిపాడు నుంచి అదనంగా నీటిని తీసుకుపోతున్నా కమిషన్ ల కోసమే కేసీఆర్ మౌనంగా ఉంటున్నారని ఆమె ధ్వజమెత్తారు. అద‌న‌పు నీటిని తీసుకుపోకుండా ఆపే శక్తి కేసీఆర్‌కు ఉందా? అని అరుణ సవాల్ చేశారు. ఏడు సంవత్సరాలుగా తెలంగాణ ప్ర‌భుత్వం రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన ప్రాజెక్టు ఒక్కటి కూడా లేద‌ని ఆమె దయ్యబట్టారు. పాత ప్రాజెక్టులకే పేరు మార్చి తానే నిర్మించానని సీఎం చెప్పుకుంటున్నాడ‌ని ఎద్దేవా చేశారు. 
 
పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, ఎస్ఎల్‌బీసీ, ఏఎమ్ఆర్‌పీ ప్రాజెక్టులకు భవిష్యత్తులో భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పాలమూరు-రంగారెడ్డి కి జూరాల నుంచి 5 టిఎంసిలు, నార్లపూర్ ప్రాజెక్ట్ నుంచి మూడు టీఎంసీలను 30 రోజుల్లో నే నీళ్లు డ్రా చేయాలని, కల్వకుర్తి పాలమూరు రంగారెడ్డి, దిండి ప్రాజెక్టు లకు వేరువేరుగా నీటిని డ్రా చేయాలని అరుణ స్పష్టం చేశారు. 
 
పోతిరెడ్డిపాడుకు గతంలో 12 టిఎంసిల నీటిని ఏపీ కి తరలించారని, అదనంగా ఇప్పుడు మ‌రో మూడు టీఎంసీలు తరలించేందుకు కుట్ర చేస్తున్నార‌ని ఆమె ఆప్పించారు. 

నీటి కేటాయింపుల వాటా విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ముందు చూపు లేదని అరుణ ధ్వజమెతాయారు. సీఆర్ కేవలం మాటలతోనే సరిపెడుతున్నారని చెబుతూ 203 జీవోను అడ్డుకునే శక్తి కేసీఆర్ కు ఉందా అని ఆమె నిలదీశారు.