మొదటిసారి పివి పేరు స్మరించిన సోనియా 

మాజీ ప్రధాన మంత్రి, కాంగ్రెస్ దిగ్గజం పివి నరసింహారావు మరణించిన 16 సంవత్సరాలకు పైగా కాలం గడచిన తర్వాత కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మొదటిసారిగా నేడు ఆయన పేరును స్మరించుకున్నారు. పైగా, “పివి నరసింహారావు మన వాడు, పీవీ మాకు ఎల్లప్పుడూ గర్వకారణం” అని పేర్కొనడం ద్వారా అందరికి విస్మయం కలిగించారు.

2014లో నరసింహారావు మృతి చెందగానే అప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న సోనియా గాంధీ ఆమె పట్ల ఎంతో అవమానకరంగా ప్రవర్తించిన తీరు గుర్తున్న వారికి ఈ మాటలు ఒకింత ఆశ్చర్యం కలిగిస్తాయి. కనీసం ఆయనకు ఢిల్లీలో అంత్యక్రియలు జరుపనీయలేదు. ఆయన మృత దేహాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఆవరణలోకి రానీయలేదు. 

ఆ తర్వాత ఎప్పుడు కాంగ్రెస్ వేదికలపై ఆయన ప్రస్తావనను తీసుకు రానీయలేదు. పార్టీ బ్యానర్లలో, ప్రచురణాలలో ఆయన ఫోటో ఎక్కడా కనిపించనీయలేదు. ఐదేళ్లకు పైగా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా, దీర్ఘకాలం కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయన ఫోటోను ఏఐసీసీ కార్యాలయంలో కనిపించనీయలేదు. ఆయన జయంతులు, వర్ధంతులు ఎప్పుడు జరుపలేదు. 

అయితే ఏనాడూ పీవీ అభిమానిగా లేక పోయినా, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన పివి శతజయంతి ఉత్సవాలను రాజకీయ కారణాలతో అధికారికంగా జరపడాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించడంతో ఆమె ఇరకాటంలో పడినట్లు అయింది.  దానితో ఆమె మొదటిసారిగా ఆయన పేరును స్మరించుకో వలసి వచ్చింది. 

హైదరాబాద్‌లోని ఇందిరాభవన్‌లో ప్రదేశ్  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిపిన  పీవీ శత జయంతి వేడుకలకు పంపిన వీడియో సందేశంలో పీవీ ఘనకీర్తిని కొనియాడారు. పీవీ నరసింహారవు శత జయంతి వేడుకలను పార్టీ ఏడాది పాటు నిర్వహిస్తోందని ఆమె చెప్పారు. 

పరోక్షంగా కేసీఆర్ ను ప్రస్తావిస్తూ పీవీ గురించి ఎవరు వేడుకలు నిర్వహించిన స్వాగతిస్తామని సోనియా చెప్పారు. అన్నింటికన్నా ఆశ్చర్యం ఏమిటంటే పీవీ స్ఫూర్తితో పని చేసి 2023లో తెలంగాణలో అధికారంలోకి వస్తామని సోనియా విశ్వాసం వ్యక్తం చేశారు. తన కుటుంభం బొమ్మలు చూపితే ఇంకెవ్వరు ఓట్లు వేయరని ఆమె గ్రహించినట్లున్నది.

.