కాళేశ్వరం కమీషన్లతో 16 లక్షల ఇండ్లు 

కాళేశ్వరం ప్రాజెక్టులో సీఎం కేసీఆర్ కుటుంబం తీసుకున్న కమీషన్లతో రాష్ట్రంలో 16 లక్షల రెండు పడకల  ఇండ్లు పూర్తయ్యేవని, దాని వల్ల 56 లక్షల మందికి లబ్ధి చేకూరేదని మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు జి.వివేక్ వెంకటస్వామి ధ్వజమెత్తారు. 
 
కాళేశ్వరం అంచనా వ్యయం రూ.లక్ష కోట్లలో రూ.70 వేల కోట్లు సీఎం కేసీఆర్ కుటుంభం కమీషనే అని ఆరోపించారు. తాను ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని వ్యతిరేకించటం లేదని, ఇరిగేషన్ పేరుతో కేసీఆర్ కుటంబం పాల్పడుతున్న కమీషన్ దందానే వ్యతిరేకిస్తున్నానని స్పష్టం చేశారు.
 
రూ.36 వేల కోట్ల అంచనా వ్యయంతో తలపెట్టిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో రూ.12 వేల కోట్లతో చేపట్టిన 30 శాతం పనులు తెలంగాణ రాకముందే పూర్తయ్యాయని, ఈ ప్రాజెక్టు పూర్తయితే అదనంగా 18 లక్షల మంది రైతులు లబ్ధి పొందేవారని వివేక్ చెప్పారు. 
 
అయితే రూ.36 వేల కోట్ల ప్రాణహిత ప్రాజెక్టును రీడిజైన్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టుగా పేరు మార్చి అంచనా వ్యయాన్ని రూ.లక్ష కోట్లకు పెంచారని ఆరోపించారు. రెండేండ్లు అయినా కాళేశ్వరం నుంచి రైతులకు నీళ్లు అందలేదని వివేక్ తెలిపారు.