బెయిల్ కోసమే వరవరరావు అనారోగ్యం సాకులు

ఆరోగ్య కారణాలపై తనకు బెయిల్ ఇవ్వాలని విప్లవ కవి వరవరరావు కోరడం కేవలం సాకు మాత్రమేనని, కొవిడ్-19 పరిస్థితిని, తన వృద్ధాప్యాన్ని అడ్డం పెట్టుకుని ప్రయోజనం పొందడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని ఎల్గార్ పరిషత్-మావోయిస్టు సంబంధాల కేసును దర్యాప్తు చేస్తున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌ఐఎ) బొంబాయి హైకోర్ట్ లో వాదించింది.

వరవరరావు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అవసరం లేదని బొంబాయి హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొంది. ఈ అఫిడవిట్‌ను ఎన్‌ఐఎ ఈ నెల 16న, వరవరరావుకు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ జరిగిన నాడు హైకోర్టులో దాఖలు చేసింది.

ఆరోగ్య కారణాలు సాకుగా చూపించి బెయిల్ పొందడానికి వరవరరావు ప్రయత్నిస్తున్నారని, వేరే కారణాలతో ఈ కేసులో ఆయనకు బెయిల్ లభించే అవకాశం లేదని ఎన్‌ఐఎ పేర్కొంది. జైలు అధికారులు సకాలంలో స్పందించి నిందితుడు వరవరరావుకు అవసరమైన వైద్య సహాయం సమకూర్చారని స్పష్టం చేసింది.

మే 28న కళ్లు తిరుగుతున్నాయన్న కారణంపై జెజె ఆసుపత్రిలో చేరిన ఆయనను చికిత్స అనంతరం ఎటువంటి కరోనా లక్షణాలు లేనందువల్ల డిశ్చార్జ్ చేయడం జరిగిందని ఎన్‌ఐఎ తెలిపింది. మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందడానికి అవసరమైన తీవ్రమైన అనారోగ్యమేదీ ఆయనకు లేదని జెజె ఆసుపత్రి సమర్పించిన వైద్య నివేదిక స్పష్టం చేస్తున్నట్లు వెళ్ళైదించింది.

కరోనా వైరస్, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వరవరరావు ప్రస్తుతం ముంబయిలోని నానవతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.