తెలంగాణ‌లో వైర‌స్ సామజిక వ్యాప్తి ప్రారంభం 

తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ సామజిక వ్యాప్తి ప్రారంభ‌మైంద‌ని తెలంగాణ వైద్య విద్య  డైర‌క్ట‌ర్ ర‌మేష్ రెడ్డి తెలిపారు. రాబోయే నాలుగైదు వారాల పాటు ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించారు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ప‌రిస్థితి ఉంద‌ని పేర్కొన్నారు. కాబ‌ట్టి ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు. 
 
అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్పా ఇంట్లో నుంచి ఎవ‌రూ బ‌య‌ట‌తిర‌గొద్ద‌ని చెప్పారు. ప్ర‌థ‌మ న‌గ‌ర‌లాతో పాటు ద్వితీయ న‌గ‌రాల్లో క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంద‌ని, కరోనా లక్షణాలు ఉంటేనే టెస్టులు చేయించుకోవాలని కోరారు. ఉత్సాహంగా ఉన్నవారికి టెస్ట్ అవసరం లేదని స్పష్టం చేశారు.  కరోనా రోగులకు వెంటనే చికిత్స చేస్తే మంచిదని అభిప్రాయం వ్య‌క్తం చేశారు.
  
మెడికల్ సిబ్బంది చాలా ఒత్తిడిలో ఉన్నారని చెబుతూ  వైద్యశాఖలో వెయ్యిమందికి పైగా సిబ్బంది, కుటుంబాలు కరోనా బారినపడ్డారని తెలిపారు. కరోనా నియంత్రణకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రూ.100 కోట్లు కేటాయించిన్నట్లు చెప్పారు. 
 
70 శాతం మంది హోమ్ ఇసోలేషన్ లో ఉన్నారని చెబుతూ తెలంగాణలో కరోనా బారిన పడ్డ వారిలో 99 శాతానికి పైగా రికవరీ ఉన్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలో రోజుకు 15వేల టెస్టులు జరుగుతున్నాయిని వివరించారు.
 
కాగా, రాష్ట్రంలో కరోనా మరణాలను తగ్గించే దిశగా పనిచేయాలని మంత్రి ఈటెల రాజేందర్ వైద్య అధికారులను ఆదేశించారు. వైరస్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించి, దాని నివారణకు అన్ని చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. దీనిలో భాగంగా జిల్లా కేంద్రాల్లోనూ మరిన్ని ఐసొలేషన్ సెంటర్స్‌ను ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు. 
 
 అయితే వైరస్ సోకుతున్న వారిలో సుమారు 85 శాతం మందికి ఎలాంటి లక్షణాలు లేకపోవడం వలన వైరస్ వ్యాప్తిని గుర్తించడం కాస్త ఇబ్బందికరంగా మారిందని మంత్రి చెప్పారు. దీంతో వైద్యసిబ్బంది క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకొని కరోనా కట్టడికి కృషి చేయాలని సూచించారు.
 
ఇలా ఉండగా, తెలంగాణలో కొత్తగా 1,567 మందికి కరోనా సోకింది. వీరికి నిర్వహించిన టెస్టుల్లో పాజిటివ్ అని నిర్ధారణ అయింది. కరోనాతో గురువారం తొమ్మిది మృతి చెందారు. ఇప్పటివరకూ కరోనా పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య 50,826కి చేరుకోగా, మృతుల సంఖ్యా 447కు చేరుకొంది.