దలైలామాకు `భారత రత్న’  సముచితం 

భారత దేశంపట్ల అమితమైన గౌరవం, శ్రద్ద కనబరుస్తున్న బౌద్ధ మత గురువు దలైలామాకు భారత అత్యున్నత పురస్కారం `భారత రత్న’  అందించడం సముచితంగా ఉండగలదని ప్రవాసంలో టిబెట్ ప్రభుత్వ అధ్యక్షుడు, దలైలామా రాజకీయ వారసుడు డా.  లోబ్ సాంగ్ సాగాయి సూచించారు.

ప్రజ్ఞాభారతి “భారత్ భద్రతకు చైనా నుండి టిబెట్ ను కాపాడవలసిన అవసరం” అంశంపై జరిపిన వెబినార్ లో మాట్లాడుతూ భారత భద్రత టిబెట్ సుస్థిరతపైననే ఆధారపడి ఉన్నదని స్పష్టం చేశారు.

నోబెల్ శాంతి బహుమతితో సహా ప్రపంచంలోని అత్యున్నత పురస్కారాలు అన్ని 150 వరకు ఇప్పటికే దలైలామాకు లభించాయని, ప్రస్తుత శతాబ్దంలో అంతర్జాతీయంగా అత్యంత ప్రభావంతమైన వ్యక్తి అని పేర్కొంటూ తనను తాను `భారత దేశపు గర్వించదగిన కుమారుడు’ అని చెప్పుకొంటారని గుర్తు చేశారు. అయితే భారత దేశమే ఇప్పటి వరకు ఆయనకు ఎటువంటి పురస్కారం ఇవ్వలేదని తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా భారత దేశ ప్రయోజనాలకోసం దలైలామా విశేషంగా కృషిచేస్తూ `భారత రాయబారి’గా వ్యవహరిస్తున్నారని చెప్పారు. 2014లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కలసినప్పుడు 45 నిముషాల సమావేశంలో తొలి 30 నిముషాలు టిబెట్ గురించి కాకుండా భారత్ గురించే మాట్లాడారని గుర్తు చేశారు. ఇప్పటికే భారత ప్రజల అందరి గౌరవాన్ని పొందుతున్నారని వివరించారు.

`భారత రత్న’ ఇవ్వడం ద్వారా ప్రజలు ఆయన పట్ల చూపుతున్న గౌరవాన్ని సూచించినట్లు కాగలదని  డా.  లోబ్ సాంగ్ సాగాయి పేర్కొన్నారు. అయితే చైనాతో మంచిగా ఉండడం ద్వారా సరిహద్దుల్లో ఆ దేశంతో సమస్యలు లేకుండా చేసుకోవచ్చనే దురభిప్రాయంతో భారత దేశ పాలకులు వ్యవహరిస్తున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు. అందుకనే టిబెట్ ప్రాంతం గురించి వారు మాట్లాడటం లేదని చెప్పారు.

గాల్వన్ లోయలో ఇటీవల చైనా దురాక్రమణల గురించి ప్రస్తావిస్తూ ఇప్పుడు భారత్ చైనా ఒకటి, రెండు కిమీ లోపలకు వ్సక్తేనే ఆందోళన చెందుతున్నదని గుర్తు చేశారు. అయితే వాస్తవానికి చైనాతో భారత్ కు అసలు సరిహద్దు అంటూ లేదని, టిబెట్ ను ఆక్రమించడంతో చైనా సేనలు నేరుగా భారత్ వైపుకు రాగలుగుతున్నాయని తెలిపారు. ఆదివారలో టిబెట్ కు భారత్ తో  గల 3,000 కిమీ సరిహద్దులో కేవలం 75నుండి 100 మంది సేనలు మాత్రమే గస్తీకి తిరిగేవారని గుర్తు చేశారు.

చైనా సేనలు టిబెట్ ఆక్రమణకు ప్రయత్నిస్తున్నప్పుడు తాము సహాయం కోరితే భారత్ పట్టించుకోలేదని, ఇప్పుడు టిబెట్ సైనిక ప్రాంతంగా మారి భారత్ భద్రతకు కూడా ప్రమాదకారిగా మారినదని గుర్తు చేశారు. టిబెట్ లోకి చైనాను అనుమతించినందుకు భారత్ ఇప్పుడు భారీ మూల్యం చెల్లిస్తున్నదని తెలిపారు. 1950లో ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్య దేశం గుర్తించినప్పుడు భారత్ చైనాకు గుర్తింపు ఇచ్చి పెద్ద పొరపాటు చేసారని స్పష్టం చేశారు.

ఆ నాడు భారత్ కు భద్రతా మండలంలో శాశ్వత సీట్ ఇస్తామంటే చైనా కు వదిలి వేశారని, కానీ ఇప్పుడు 60 ఏళ్ళ తర్వాత భారత్ ఆ సీట్ కోరుతుంటే చైనా అడ్డుపడుతున్నదని వివరించారు. బ్రిటిష్ భారత్ ప్రభుత్వం టిబెట్, చైనాలతో 1945లో సిమ్లాలో సదస్సు జరిపి అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుగా మెక్ మోహన్ లైన్ ను నిర్ణయిస్తే దానిని అధికారికంగా ప్రకటించడానికి భారత్ ఎందుకు వెనుకడుగు వేస్తున్నదని ప్రశ్నించారు.

టిబెట్ ను కాపాడకపోతే మీరు ప్రమాదంలో పడతారని హెచ్చరించినా భారత్ నాయకత్వం పట్టించుకొనక పోవడంతో ఇప్పుడు 25 లక్షల కిమీ భూభాగం చైనా ఆక్రమించుకున్నదని  డా.  లోబ్ సాంగ్ సాగాయి పేర్కొన్నారు.