రాజధాని, సీఆర్డీయే బిల్లులపై పిఎంఓ ఆరా

పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో ప్రస్తుతం కొనసాగుతున్న రాజధాని అమరావతిని మార్చడానికి రాష్ట్ర వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లుతోపాటు సీఆర్‌డీఏ రద్దు బిల్లుపై  ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఆరా తీసిన్నట్లు తెలుస్తున్నది.
ప్రస్తుతం గవర్నర్‌ పరిశీలనలో ఉన్న ఈ రెండు బిల్లులకు సంబంధించిన తాజా వివరాలపై గవర్నర్‌ కార్యాలయ అధికారులతో సంప్రదింపులు జరిపినట్టు చెబుతున్నారు. అమరావతి జేఏసీ గౌరవ నేత, హిందూ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్‌ జీవీఆర్‌ శాస్త్రి  ఈ బిల్లుల అంశంపై ప్రధానమంత్రికి ఇటీవల లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు పంపిన ప్రతిపాదనల వివరాలన్నీ ఆయన పీఎంవోకు సమర్పించారు.
పిఎంఓ ఆరా తీయడాన్ని శాస్త్రి ధ్రువీకరించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేసిన రాజధానిని ఇపుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణ పేరుతో మార్చడంవల్ల ప్రజలకు అపారమైన నష్టం వాటిల్లుతుందని అయన ఆవేదన వ్యక్తం చేశారు.
రాజధానికోసం 29గ్రామాలకు చెందిన రైతులు దాదాపు 33వేల ఎకరాలను ఇచ్చారు. కేవలం రాష్ట్ర రాజధాని కోసమే వారు భూములిచ్చి త్యాగం చేశారని తెలిపారు. రాజధాని ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశమే. అయితే,  పునర్విభజన చట్టం ద్వారా అమరావతిని రాజధానిగా నిర్ణయించి, అనేక అభివృద్ధి పనులు కూడా అక్కడ చేపట్టారని గుర్తు చేశారు.
అయినా, ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మార్చడం సరికాదని శాస్త్రి స్ఫష్టం చేశారు.  అమరావతిలో హైకోర్టు ఏర్పాటుకు సంబంధించిన నోటిఫికేషన్‌ కూడా రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాతే తీసుకొచ్చారని ఆయన గుర్తుచేశారు.
రాజధాని మార్పుతో ప్రజలకు కలిగే నష్టాల వివరాలన్నీ తెలియజేస్తూ…రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, కేంద్ర హోంశాఖ మంత్రికి ఇదివరకే లేఖలు రాసినట్లు శాస్త్రి  వెల్లడించారు. తన లేఖపై ప్రధాని కార్యాలయం మరికొన్ని తాజా వివరాలు అడగగా, వాటిని అందించానని తెలిపారు.
పునర్విభజన చట్టం ప్రకారం ముందుగా నిర్ణయించిన రాజధానిని మార్చడం ఎలా సాధ్యం కాదనేది పీఎంవోకు వివరించినట్లు చెప్పారు. రాజధాని మార్పు ప్రతిపాదనల అంశంపై అటార్నీ జనరల్‌ న్యాయసలహా కూడా తీసుకోవాలని తన లేఖలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు జీవీఆర్‌ శాస్త్రి పేర్కొన్నారు.