అయోధ్యలో కొత్త అధ్యాయం 

కె. రఘురామకృష్ణరాజు, పార్లమెంట్‌ సభ్యులు

భారతదేశ జాతీయ గుర్తింపునకు, ఐక్యతకు, సమగ్రతకు శ్రీరాముడు విశిష్టమైన సంకేతం. ఉన్నత విలువలతో కూడిన జీవితాన్ని జీవించేందుకు భారతీయుల ఆకాంక్షల్లో ప్రతిఫలించే ఆదర్శవంతుడు శ్రీరాముడు. అందువల్ల వేలాది సంవత్సరాల నుంచి హిందువుల ప్రగాఢ భక్తి భావానికి అయోధ్యలో రాముడు జన్మించిన ప్రదేశం కేంద్రబిందువు కావడంలో ఆశ్చర్యం లేదు.

దైవంగానే కాకుండా మర్యాద పురుషుడిగా, అన్ని ఆదర్శాలు మూర్తీభవించిన సంపూర్ణ వ్యక్తిగా కోట్లాది హిందువులు వేలాది సంవత్సరాలుగా ఆరాధిస్తున్న శ్రీరామచంద్రుడి జన్మభూమి అయోధ్యలో రామాలయం నిర్మాణానికి రంగం సిద్ధం కావడం చరిత్రపరంగా కీలక పరిణామం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా రామాలయ నిర్మాణానికి ఆగస్టు 5న భూమి పూజ జరుపబోవడం హర్షణీయ పరిణామం. 

సుమారు 135 సంవత్సరాలుగా కోర్టు వివాదాలతో ఆవేశాలు, ఉద్రిక్తతలు చెలరేగి దేశంలో పలు పరిణామాలకు కేంద్రంగా మారిన అయోధ్యలో సామరస్యంగా, ఉన్నత న్యాయస్థానం ద్వారా ఒక పరిష్కారం లభించి, భవ్యమైన రామాలయం నిర్మాణానికి నడుం బిగించడం ఒక విధంగా మోదీ చతురతకు నిదర్శనం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదటి నుండి అయోధ్య అంశాన్ని రాజకీయ వివాదంగా కాకుండా కోట్లాది హిందువుల మనోభావాలను సంబంధించిన అంశంగా పరిగణిస్తూ, ఉద్రిక్తతలకు ఆస్కారం లేకుండా శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేశారు.

సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడానికి ముందే తీర్పు ఏ విధంగా ఉన్నా కట్టుబడి ఉంటామని ముందుగానే ఒక వంక ఆర్‌ఎస్‌ఎస్‌ వంటి సంస్థలు, మరోవంక ముస్లిం సంస్థలు దేశ ప్రజలకు భరోసా ఇచ్చాయి. ఆ విధమైన సామరస్యతకు అనువైన వాతావరణం ఏర్పర్చిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీదే అని చెప్పాలి. 

వాస్తవానికి తొలి స్వతంత్ర సమరంగా పేర్కొనే 1857 పోరాటంలో హిందువులు, ముస్లింలు కలసి బ్రిటిష్‌ పాలకులపై తిరగబడ్డారు. అప్పటి నుండే బ్రిటిష్‌ పాలకులు జాగ్రత్తపడి ఆ ఇరు వర్గాల మధ్య వైరుధ్యాలను పెంచే ప్రయత్నం చేయడం ప్రారంభించారు. ఆ ప్రయత్నాలకు పరాకాష్టగా, దేశం వదిలి వెళ్లిపోక తప్పని పరిస్థితులు ఏర్పడినప్పుడు, దేశ విభజనకు నడుం కట్టారు. అయోధ్యలోని రామాలయాన్ని 16వ శతాబ్దంలో బాబర్‌ ధ్వంసం చేసి అక్కడ మసీదు నిర్మించారని హిందువుల విశ్వాసం. ఈ విషయమై తొలుత 1885 స్థానిక మహంత్‌ స్థానిక కోర్టులో దావా వేసాడు. అక్కడ రామాలయం ధ్వంసం చేసి మసీదు కట్టారని ఆరోపించాడు.

1949 అలాహాబాద్‌ హైకోర్టు హిందువులకు అక్కడ శ్రీరాముడి విగ్రహం పెట్టి, కోర్టు పర్యవేక్షణలో సంవత్సరానికి ఒకసారి ప్రార్థనలు చేయడానికి అనుమతి ఇచ్చింది. అప్పటి నుండి అక్కడ శ్రీరాముడికి పూజలు కోర్టు పర్యవేక్షణలో సంవత్సరానికి ఒకసారి జరుగుతున్నాయి. ముస్లింల విశ్వాసం ప్రకారం నమాజుకు స్థల ప్రాధాన్యత ఉండదు. హిందూ దేవాలయాలకు స్థల ప్రాధాన్యత ఉంటుంది. పైగా, ఇతర దైవాల పూజలు జరిగే చోట ముస్లింలు నమాజ్‌కు ఇష్టపడరు.

దానితో 1949 నుండి అక్కడ నమాజ్‌ జరగడం లేదు. ఈ విషయమై హిందువులు, ముస్లింలకు నచ్చ చెప్పే ప్రయత్నం చేసి ఉంటే ఎప్పుడో సమస్య పరిష్కారం అయి ఉండేది. కానీ అటువంటి ప్రయత్నాలు జరుగలేదు. పైగా, సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం ఒకరిపై మరొకరిని రెచ్చగొట్టే ప్రయత్నాలను ప్రధాన రాజకీయ పక్షాలు చేశాయి.

ఈ లోగా, 1985లో షాబానో కేసులో సుప్రీం కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఉత్తరువు జారీచేసి దేశ ప్రజల ఆగ్రహానికి గురయిన రాజీవ్‌ గాంధీ 1986లో శ్రీరాముడి విగ్రహానికి రోజువారీ పూజలకు అనుమతి ఇచ్చారు. 1988లో రామాలయ నిర్మాణానికి శిలాన్యాస్‌ జరపడానికి రాజీవ్‌ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 1989లో ఎన్నికల ప్రచారాన్ని అయోధ్య నుండి ‘రామరాజ్యాన్ని నెలకొల్పుతామని’ హామీ ఇస్తూ రాజీవ్‌ గాంధీ ప్రారంభించారు. ఇదీ చరిత్ర.

మరోవంక, సామరస్యంగా పరిష్కరించే ప్రయత్నాలు జరగకపోవడంతో అసహనం ప్రబలి 1991లో వివాదాస్పద బాబ్రీ మసీదు కట్టడాన్ని ధ్వంసం చేశారు. తాత్కాలిక రామాలయాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుండి అక్కడ పూజలు జరుగుతున్నాయి. ఇలా ఉండగా, 2010లో ఈ భూమిని మూడు భాగాలుగా చేస్తూ అలహాబాద్‌ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు ఇరువర్గాలు వెళ్లగా గత ఏడాది తుది తీర్పు వచ్చింది. 

పీవీ నరసింహారావు హయాంలో హిందూ, ముస్లింల మధ్య సయోధ్యకు ప్రయత్నాలు మొదటిసారిగా ప్రభుత్వం వైపు నుండి జరిగాయి. కోర్టులోనే తేల్చుకుంటామని ఇరువర్గాలూ స్పష్టం చేయడంతో, వివాదాస్పద భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, తీర్పు చెప్పమని కోర్టును అడిగింది. అయితే అందుకు మొదట్లో ఒప్పుకున్న ఒక వర్గం రాజకీయ కారణాలతో వెనుకడుగు వేయడంతో ప్రభుత్వం ఆ కేసును వెనుకకు తీసుకోవలసి వచ్చింది. 

అంతకుముందు 1988లో అధికారంలోకి వచ్చిన విపి సింగ్‌కు అటువంటి అవకాశం వచ్చినా సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం ఇరు వర్గాలను రెచ్చగొట్టే ప్రయత్నం ఆయన చేశారు. 1999లో అధికారంలోకి వచ్చిన అటల్‌ బిహారీ వాజపేయి పరిష్కారం కోసం పూజ్యులు శ్రీ జయేంద్ర సరస్వతి గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసినా ప్రయోజనం లేకపోయింది. ఈ విధంగా 75 ఏళ్లుగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న అయోధ్య అంశం ఇప్పుడు ప్రశాంతంగా, సామరస్యంగా ఒక నూతన అధ్యాయానికి దారితీయడం సంతోషకరం. ఈ ఘనత ప్రధాని మోదీకే దక్కుతుంది. 

135 ఏళ్లుగా హిందూ సంస్థలు అక్కడ రామాలయం నిర్మించాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ దీనిని ఒక ప్రజా ఉద్యమంగా మార్చింది 1990లో సోమనాథ్‌ నుండి అయోధ్య వరకు నాటి బిజెపి అధ్యక్షుడు ఎల్‌.కె. ఆద్వానీ జరిపిన రథయాత్ర అని చెప్పవచ్చు. ఈ యాత్రకు రథసారథిగా వ్యవహరించిన నాటి బిజెపి ప్రధాన కార్యదర్శి మోదీ ఆ చారిత్రాత్మక పరిణామంలో కీలక పాత్ర పోషించారు.

1990 సెప్టెంబర్‌ 25న సోమ్‌నాథ్ మందిరంలో జ్యోతిర్లింగం వద్ద ప్రార్థనల అనంతరం, సంప్రదాయమైన శంఖారావాలు, ‘జై శ్రీరామ్’… ‘సౌగంధ్‌ రామ్‌ కీ ఖాతే హై… మందిర్‌ వహీ బనాయేంగే..’ (రాముని పేరిట ప్రమాణం చేస్తున్నాం… రామ్ లల్లా ఉన్నచోటే మందిరం కడతాం) అన్న నినాదాల హోరులో రాముని రథయాత్ర కదిలింది. ఈ యాత్ర దేశ రాజకీయ స్వరూపంలోనే నిర్ణయాత్మక మార్పును తీసుకువచ్చింది.

ప్రధానమంత్రి మోదీ అయోధ్యలో చేయబోతున్న భూమి పూజకు అవసరమైన సన్నాహాలు, ధార్మిక క్రతువులను ఈ సంవత్సరం జూన్‌ 10 నుండే జరుపుతున్నారు. లంకపై దాడికి ముందుగా శ్రీరాముడు రుద్రాభిషేకం జరిపిన సంప్రదాయాన్ని అనుసరించి రుద్రాభిషేకం, మహా ఆరతితో ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సారథ్యంలో ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఈ నిర్మాణ కార్యక్రమం దృష్ట్యా అక్కడున్న రామ్ లల్లా విగ్రహాలను సాంప్రదాయకంగా అక్కడనే గల మానస్‌ భవన్‍లోకి తాత్కాలికంగా గత మార్చ్‌లో తరలించారు.

ప్రభుత్వం నియమించిన రామ్ జన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణం జరుగుతున్నది. ఆలయ నిర్మాణం కోసం సుమారు రూ.300 కోట్లు, చుట్టూ గల 20 ఎకరాల స్థలం అభివృద్ధికి మరో రూ.1,000 కోట్లు అవసరం కాగలవని అంచనా వేశారు. ఈ మొత్తాలను దాతల నుండే సేకరించాలని నిర్ణయించారు. 

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది హిందువులు ఆలయ నిర్మాణంలో భాగస్వాములయ్యే విధంగా నిధులు సేకరించాలని నిర్ణయించారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా నిధి సేకరణ ఇంకా పెద్ద ఎత్తున ప్రారంభించలేదు. మూడున్నరేళ్లలో ఆలయ నిర్మాణం పూర్తి కాగలదని భావిస్తున్నారు. ఈ పవిత్ర కార్యక్రమంలో నా వంతు ఉడతా భక్తిగా పార్లమెంట్‌ సభ్యుడిగా నాకు వచ్చే మూడు నెలల జీతాన్ని ట్రస్ట్‌కు ఇటీవలే విరాళంగా ఇచ్చాను.

ఈ పవిత్ర కార్యక్రమంలో దేశంలోని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరుతున్నాను. అయోధ్యలో రామాలయం నిర్మాణానికి అందరిని భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో విశ్వహిందూ పరిషత్‌ కరసేవా కార్యక్రమం చేపట్టనున్నది. ఈ పవిత్ర కరసేవా కార్యక్రమంలో కూడా నేను భాగస్వామినవుతాను. 

ఆగస్ట్‌ 5వ తేదీన వెండి ఇటుకలతో జరిగే భూమిపూజలో ప్రధాని మోదీ మొదటి ఇటుకను పేర్చనున్నారు. హిందూ పురాణాల ప్రకారం అయిదు గ్రహాలకు సూచకంగా అయిదు వెండి ఇటుకలను వాడనున్నారు. నగర విష్ణు ఆలయం శైలిలో ఆలయాన్ని తీర్చిదిద్దనున్నారు. అష్టభుజ ఆకారంలో గర్భాలయం ఉంటుంది. గతంలో ఇచ్చిన నమూనా కన్నా ఆలయం ఎత్తు, వైశాల్యం, పొడుగును పెంచారు.

ముందుగా అనుకున్న మూడు గోపురాల స్థానంలో అయిదు గోపురాలను నిలుపనున్నారు. ఆలయ విస్తీర్ణం సుమారు 76 వేల చదరపు గజాల నుంచి 84వేల చదరపు గజాలు ఉంటుంది. అలాగే ఆలయంలో శ్రీ రాముడి విగ్రహం ఎత్తును కూడా 128 అడుగుల నుండి 161 అడుగులకు మార్చారు. ఆగస్టు 3వ తేదీన పూజలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 4వ తేదీన పూజ్యులు శ్రీ రామాచార్య పూజ నిర్వహిస్తారు. ఆగస్టు 5న మధ్యాహ్నం 12.15 నిమిషాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భూమిపూజ చేయనున్నారు. 

భారతదేశంలోని కోట్లాది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అయోధ్యలో రామాలయం నిర్మాణం కార్యక్రమం ప్రారంభం కావడం ఎంతో ఆనందదాయకం. ఈ మహత్తర కార్యక్రమం ప్రధాని మోదీ చేతుల మీదుగా జరగడం ఎంతో గర్వకారణం. అయోధ్యలో రామాలయం నిర్మాణం పూర్తయి, ప్రారంభం కూడా ఆయన చేతుల మీదుగానే జరగాలని మనసావాచా కోరుకుంటున్నాను.

ప్రముఖ గాయని శ్రీమతి లతా మంగేష్కర్‌ గానం చేసిన విధంగా: ‘‘రామ్ నామ్ జాదూ ఐసా, రామ్ నామ్ మన్‌ భాయే/ మన్‌కీ అయోధ్యా తబ్‌ తక్‌ సూని, జబ్‌ తక్‌ రామ్ న ఆయే రే’’ (రామ నామంలో ఎంత మంత్రం ఉందంటే అది మనసుకు శాంతిని, సంతోషాన్ని అందజేస్తుంది. రాముడు ప్రవేశించనంతవరకూ నా మనసులో అయోధ్య ఖాళీగానే ఉంటుంది.)

(ఆంధ్ర జ్యోతి నుండి)