సుప్రీం లో సచిన్ కు ఊరట,  గెహ్లోత్‌కు జ‌ల‌క్

సుప్రీం కోర్టులో తిరుగుబాటు నేత సచిన్ పైలట్‌కు ఊరట లభించగా, ముఖ్యమంత్రి గెహ్లోత్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ప్రజాస్వామ్యంలో అసమ్మతి గొంతులను అణచివేయలేమని సుప్రీం ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
త‌ట‌స్థ వ్య‌క్తి అయిన స్పీక‌ర్ ఎందుకు కోర్టును ఆశ్ర‌యించార‌ని ఇవాళ సుప్రీం ధ‌ర్మాస‌నం ప్ర‌శ్నించింది. ఓ నేత ఇత‌రుల‌పై విశ్వాసం కోల్పోయినా, ఒక‌వేళ వారు ఆ పార్టీలోనే ఉంటే వారిపై ఎలా అన‌ర్హ‌త వేటు వేస్తార‌ని  జ‌స్టిస్ ఏకే మిశ్రా అడిగారు. ఇలా చ‌ర్య‌లు తీసుకుంటే అదే అల‌వాటుగా మారుతుంద‌ని, అప్పుడు వారు త‌మ స్వ‌రాన్ని వినిపించ‌లేర‌ని చెబుతూ ప్ర‌జాస్వామ్యంలో అస‌మ్మ‌తి స్వ‌రాన్ని ఇలా నొక్కిపెట్ట‌లేమ‌ని జ‌స్టిస్ మిశ్రా పేర్కొన్నారు.
 
అనర్హత నోటీసులను సవాల్ చేస్తూ సచిన్ పైలట్‌తో పాటు అసంతృప్త ఎమ్మెల్యేల పిటిషన్లపై ఉత్తర్వులు జారీ చేయకుండా రాజస్థాన్ హైకోర్టును నిలువరించలేమని సుప్రీం స్పష్టం చేసింది. దీంతో సచిన్ పైలట్ వర్గానికి భారీ ఊరట లభించినట్లే. 
 
మరోవంక, సచిన్ పైలట్ పిటిషన్‌పై రాజస్థాన్ హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించేందుకు సుప్రీం అనుమతినిచ్చింది. కాగా, 
ఈ విషయాన్ని హైకోర్టు నుంచి సుప్రీంకు బదిలీ చేయాన్న స్పీకర్ జోషి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సోమవారానికి వాయిదా వేసింది. 
 
పైలట్ సహా మరో 18 మంది ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసులు జారీ చేయడానికి దారి తీసిన కారణాలను తెలపాలంటూ స్పీకర్ తరపు న్యాయవాది కపిల్ సిబల్‌ను జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం వివరణ కోరింది.