వ్యాక్సిన్‌ వచ్చేంత వరకు పోరాటం చేయాల్సిందే  

కరోనా వ్యాక్సిన్‌ వచ్చేంత వరకు పోరాటం చేయాల్సిందే అని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపిచ్చారు. మణిపూర్‌‌లో నీటి సరఫరా ప్రాజెక్టులకు వీడియో ద్వారా శంకుస్థాపన చేస్తూ  కోవిడ్-19‌తో దేశం క్లిష్ట సమస్యను ఎదుర్కొంటున్నా సరే దేశమేమీ ఆగిపోలేదని ఆయన స్పష్టం చేశారు.

ఈ నీటి సరఫరా కేంద్రాలు మణిపూర్‌‌ మహిళలకు రాఖీ బహుమానమని ప్రధాని చెప్పారు. ఈ ప్రాజెక్టుల ద్వారా గ్రేటర్‌‌ ఇంఫాల్‌లోని 1700 గ్రమాలకు తాగునీరు అందుతుందని ప్రధాని పేర్కొన్నారు. స్థానిక‌ పంచాయతీలు, ప్రజల సహకారంతో ఈ ప్రాజెక్టు ప్రారంభిస్తున్నామని చెబుతూ వికేంద్రీకరణకు ఇది నిదర్శనమని కొనియాడారు. 
 
సమృద్ధి, పురోగతితో ఈశాన్య రాష్ట్రాలను అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని, అనుసంధానమే అత్యంత ప్రధానమని ఆయన తెలిపారు. ఈ అనుసంధానం అనేది కేవలం ప్రజల జీవనాధారానికే కాదని, సురక్షితమైన, స్వావలంబన భారత్ కోసం కూడా ఉపయోగపడుతుందని మోదీ పేర్కొన్నారు.
 
ఈ నీటి సరఫరా ప్రాజెక్టులు యువతకు ఉద్యోగాలు సృష్టిస్తాయని మోదీ  చెప్పారు. ఈశాన్య భారతదేశం రెండు విషయాల్లో పోరాడుతోందని చెబుతూ ఒకవైపు కరోనా మహమ్మారి, మరోవైపు వరదలతో ఇబ్బందులు పడుతున్నారని విచారం వ్యక్తం చేశారు.  దేశం అంతా మీ వెంటే ఉందని, దిగులు పడాల్సిన అవసరం లేదని ప్రధాని భరోసా ఇచ్చారు. 
 
మణిపూర్‌లో కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం రాత్రింబవళ్లు పనిచేస్తోందని మోదీ కొనియాడారు. లాక్‌డౌన్ సమయంలో ప్రజలకు అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తున్నదని చెప్పారు.