
భారత సైన్యంలో పురుషులతో సమాన హోదా పొందాలనే మహిళా అధికారుల కల నెరేవేరింది. షార్ట్ సర్వీస్ కమిషన్ కింద నియమితులైన మహిళా అధికారులందరికీ శాశ్వత కమిషన్ మంజూరు చేయాలని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశించిన ఐదు నెలల తర్వాత కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతమున్న జడ్జి అండ్ అడ్వొకేట్ జనరల్ (జాగ్), ఆర్మీ ఎడ్యుకేషనల్ కార్ప్స్ (ఏఈసీ) లతోపాటు భారత సైన్యంలోని మొత్తం పది స్ట్రీమ్‌లలో ఎస్‌ఎస్‌సీ మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ మంజూరు చేయాలని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు సైనిక ప్రతినిధి కల్నల్ అమన్ ఆనంద్ తెలిపారు. ఈ ఉత్తర్వులు మహిళా అధికారుల సాధికారతకు, వారు సైన్యంలో కీలక పాత్ర పోషించేందుకు దోహదం చేస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఆర్మీ, ఎయిర్ డిఫెన్స్, సిగ్నల్స్, ఇంజనీర్స్, ఆర్మీ ఏవియేషన్, ఎలెక్ట్రానిక్స్, మెకానికల్ ఇంజనీర్స్, ఆర్మీ సర్వీస్ కోర్, ఇంటెలిజెన్స్ కోర్‌తోపాటు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్, ఆర్మీ ఎడ్యుకేషన్ కోర్ విభాగాలలో మహిళా అధికారులకు ఇక శాశ్వత ప్రాతిపదికన పదవులు లభిస్తాయి. ఎస్‌ఎస్‌సి మహిళా అధికారులు తమ సమ్మతిని తెలియచేసి, అవసరమైన డాక్యుమెంటేషన్ పూర్తి చేసిన తర్వాత సెలెక్షన్ బోర్డు ఏర్పాటు జరుగుతుందని ఆయన చెప్పారు.
శాశ్వత కమిషన్ మంజూరుకు ఎస్‌ఎస్‌సీ మహిళా అధికారులందరి ఎంపిక, అవసరమైన డాక్యుమెంటేషన్ కోసం సెలక్షన్ బోర్డు త్వరలో షెడ్యూల్ విడుదల చేస్తుందని ఆయన వివరించారు. ఆర్మీలో పనిచేస్తున్న ఎస్‌ఎస్‌సీ మహిళా అధికారులందరికీ శాశ్వత కమిషన్ ఇవ్వాలని ఆదేశిస్తూ ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు కేంద్రానికి సుప్రీంకోర్టు ఈ నెల ప్రారంభంలోనే మరో నెల సమయం ఇచ్చింది.
ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన 2010 ఆదేశాలపై సమీక్షించిన సుప్రీంకోర్టు మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ మంజూరు చేయాలని ఈ ఏడాది ఫిబ్రవరి 17న కేంద్ర సర్కారును ఆదేశించింది. మహిళా అధికారులు తమ పురుష సహచరులతో సమానంగా సైన్యంలో కమాండ్ అండ్ క్రైటీరియస్ నియామకాలను పొందవచ్చని తీర్పు ఇచ్చింది.
త్రివిధ దళాల్లో విధి నిర్వహణ కష్టతరమైంది. దీంతో సాయుధ దళాల్లో పురుషులు మాత్రమే రాణించగలరనే అభిప్రాయం స్థిరపడిపోయింది. కాగా, 1992లో తొలిసారి త్రివిధ దళాల్లో మహిళలకు అవకాశం కల్పించారు. ఎంపికైన మహిళలను షార్ట్ సర్వీస్ కమిషన్‌లో నియమించేవారు.
ఇలా ఉద్యోగాల్లో చేరిన మహిళలు కొంత కాలానికే రిటైర్ కావాల్సి ఉంటుంది. 1992లో ప్రారంభమైన వుమెన్ షార్ట్ సర్వీస్ కమిషన్ తొలుత అయిదేళ్లకే ఉండేది. తర్వాత మరో ఐదేళ్లు పొడిగించుకునే అవకాశం కల్పించారు. మహిళలు గరిష్టంగా 14 ఏళ్లపాటు త్రివిధ దళాల్లో పనిచేసేలా 2006లో షార్ట్ సర్వీస్ కమిషన్ నిబంధనలు మార్చారు.
More Stories
గూడ్సు పట్టాలు తప్పలేదు.. కోరమాండల్ రైలే ఢీకొట్టింది
రైల్వే ప్రమాదానికి కారణం, బాధ్యులను గుర్తించాం
రైలు ప్రమాద కారకులను కఠినంగా శిక్షిస్తాం