82 శాతం తగ్గిన ట్రిపుల్ తలాఖ్ కేసులు

సామాజిక దురాచారమైన ట్రిపుల్ తలాఖ్ ‌ను అంతం చేసేందుకు చట్టం అమలు చేసిన నాటి నుంచి ఈ కేసుల సంఖ్య దాదాపు 82 శాతం తగ్గిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. త్రిపుల్ తలాఖ్‌కు అడ్డుకట్ట వేసే చట్టం అమలు జరిగిన ఆగస్టు 1వ తేదీని ముస్లిం మహిళల హక్కుల దినోత్సవంగా ఆయన అభివర్ణించారు. 

ముస్లిం మహిళల (వివాహ పరిరక్షణ హక్కులు) చట్టం, 2019 వచ్చిన నాటి నుంచి ట్రిపుల్ తలాఖ్‌కు సంబంధించిన వ్యవహారాలపై కఠిన చర్యలు అమలు అవుతున్నాయని ఆయన చెప్పారు. ట్రిపుల్ తలాఖ్-గొప్ప సంస్కరణ, మెరుగైన ఫలితాలు పేరిట రాసిన ఒక వ్యాసంలో ఆయన ట్రిపుల్ తలాఖ్ లేదా తలాఖ్-ఎ-బిద్దత్‌ను సాంఘిక దురాచారంగా పేర్కొంటూ ఇది ఇస్లాంలో లేదని స్పష్టం చేశారు.

వోట్ల రాజకీయం కోసం ఈ సాంఘిక దురాచారాన్ని కొందరు పెంచిపోషించారని ఆయన విమర్శించారు. లౌకికవాద పరిరక్షకులమని తమకు తాము చెప్పుకునే కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ, సామాజ్‌వాది పార్టీ, బిఎస్‌పి, తృణమూల్ కాంగ్రెస్ అడ్డుకున్నప్పటికీ భారత పార్లమెంట్‌లో ట్రిపుల్ తలాఖ్‌కు వ్యతిరేకంగా చట్టం ఏర్పడిన 2019 ఆగస్టు 1వ తేదీ భారత పార్లమెంట్ చరిత్రలో చారిత్రాత్మక దినంగా నిలిచిపోయిందని నఖ్వీ కొనియాడారు.