చైనా,పాక్ ఉమ్మడి దాడులకు త్రివిధ దళాలు సిద్ధం 

భారత్ పై ఉమ్మడిగా దాడులు జరిపి, భారత సేనలను ఉక్కిరి బిక్కిరి చేయాలని చైనా, పాకిస్థాన్ సేనలు సమాయత్తం  అవుతున్నట్లు కధనాలు వెలువడుతున్న దృష్ట్యా ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి భారత్  త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీతోపాటు ఎయిర్‌‌ఫోర్స్‌ అప్రమత్తమైనట్లు తెలిసింది.
ఈ విషయంలో మూడు దళాలు ఉమ్మడిగా ముందుకెళ్తున్నట్లు డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్‌మెంట్‌లోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. టాప్ ఐఏఎఫ్ కమాండర్స్‌తో డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి నుంచి దళాలు వెనక్కి తగ్గడంపై రాజ్‌నాథ్ వివరాలు అడిగి తెలుసుకున్నారని ఓ ఐఏఎఫ్ అధికారి చెప్పారు.
సరిహద్దులలో ఎదురవుతున్న సవాళ్లను దీటుగా ఎదుర్కోవడానికి దళాలను సిద్ధం చేసినందుకు ఐఏఎఫ్ కమాండర్లను రాజ్‌నాథ్‌ మెచ్చుకున్నారని తెలిసింది. దేనిని ఎదుర్కోవడానికైనా సైనిక దళాలు సంసిద్ధంగా ఉండాలని అధికారులను రాజ్‌నాథ్ ఆదేశించారని తెలుస్తున్నది.

ఎల్‌ఏసీ వెంబడి తూర్పు లడఖ్‌లో ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో లైన్ ఆఫ్ కంట్రోల్ లేదా ఇంటర్నేషన్ బార్డర్ (ఐబీ) వద్ద పాకిస్తాన్ ఏం చేస్తుందోనని ఎదురు చూశామని ఆయా వర్గాలు తెలిపాయి. అయితే ఆశ్చర్యకరంగా పాకిస్తాన్ ఎలాంటి దుందుడుకు చర్చలకు పాల్పడలేదని సదరు వర్గాలు వెల్లడించాయి. 

పాక్ మౌనం తమను ఆశ్చర్యానికి గురి చేస్తోందని, ఎందుకంటే వాళ్లు ఎల్‌వోసీ దగ్గర ఉద్రిక్తతలకు పాల్పడలేదని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. ‘చైనా మనల్ని లడఖ్‌లో ఉండేలా చేసి మరొక సెక్టార్‌‌ (ప్రాంతం)లో దాడులు చేస్తుంది. అరుణాచల్ ప్రదేశ్‌లో ఏమైనా చేయొచ్చు. దీనికి ఎల్‌ఓసీ వెంబడి ఉన్న పాకిస్తాన్‌ చర్యలకు సంబంధం ఉంటుంది’ అని ఆ వర్గాలు వివరించాయి.

మరోవంక,  చైనాకు చెందిన ప్రజా విముక్తి సేనలు వాస్తవాధీన నియంత్రణ రేఖ దగ్గర పరిస్థితిని తీవ్రతరం చేసేందుకు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తూర్పు లడాఖ్‌లో దాదాపు 40వేల మంది సైనికులు అధునాతన ఆయుధాలతో మోహరించినట్లు తెలుస్తోంది. 

భారత్ – చైనా సైనిక అధికారుల మధ్యలో కుదిరిన ఒప్పందాలను చైనా పాటించడం లేదని సైనిక వర్గాలు తెలిపాయి. “పరిస్థితులను తీవ్రతరం చేసే సంకేతాలను ఇస్తూనే ఉన్నారు. రక్షణ వ్యవస్థలు,  ఆయుధాలతో ఉన్న 40వేల మంది సేనలను మోహరించారు” అని ఒక సైనిక అధికారి చెప్పారు.