రాజ‌స్థాన్‌లో రాజ్యాంగ సంక్షోభం.. సుప్రీంకోర్టుకు స్పీక‌ర్

రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్, ఆయన వర్గీయులపై ఈనెల 24వ తేదీ వరకూ ఎలాంటి చర్య తీసుకోకుండా రాజస్థాన్ హైకోర్టు స్టే ఇవ్వడాన్ని ఆ రాష్ట్ర స్పీకర్ సీపీ జోషి బుధవారంనాడు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇది స్పీకర్ ఆదేశాల్లో జోక్యం చేసుకోవడమేనని ఆయన తన పిటిషన్‌లో అత్యున్నత న్యాయస్థానానికి తెలియజేశారు.  
రాజ్యాంగ సంక్షోభం దిశ‌గా రాజ‌స్థాన్ వెళ్తున్న‌ట్లు స్పీక‌ర్ సీపీ జోషీ ఆరోపించారు.  రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు రాజ్యాంగం ప్ర‌కారం న‌డుచుకోవ‌డంలేద‌ని విమర్శించారు. తాను రెబ‌ల్ ఎమ్మెల్యేల‌కు కేవ‌లం షోకాజ్ నోటీసులు మాత్ర‌మే జారీ చేసిన‌ట్లు స్పీక‌ర్ తెలిపారు.
స్పీక‌ర్‌కు ఉన్న అధికారాల‌ను, బాధ్య‌త‌ల‌ను సుప్రీంకోర్టు, రాజ్యాంగం స్ప‌ష్టంగా తెలియ‌జేసింద‌ని పేర్కొంటూ స్పీక‌ర్‌గా తాకు అప్లికేష‌న్ వ‌చ్చింద‌ని, దాని ప్ర‌కార‌మే తాను రెబ‌ల్ ఎమ్మెల్యేల‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసిన‌ట్లు ఆయ‌న తెలిపారు.  స్పీక‌ర్ షోకాజ్ నోటీసు ఇవ్వ‌కుంటే, మ‌రెవ‌రు ఆ పాత్ర‌ను పోషిస్తార‌ని జోషి ప్ర‌శ్నించారు.
 
ప్రతివాదులకు జారీ చేసిన అనర్హత నోటీసులపై విచారణ జరపడం, వారిని పిలిపించి సమాధానం తీసుకోవడం స్పీకర్‌కు ఉన్న విశేషాధికారమని, దానిపై స్టే ఇవ్వడం ఆ అధికారాన్ని అడ్డుకోవడమే అవుతుందన్నారు. లెజిస్టేచర్‌కు, జ్యూడిషియరీకి మధ్య రాజ్యాంగం తెలిపిన సమతూకం దెబ్బతింటుందని ఆయన పేర్కొన్నారు. 
 
హైకోర్టు స్టే ఇవ్వడం స్పీకర్‌కు ఉన్న ప్రత్యేక అధికారాల్లో జోక్యం చేసుకోవడమే అవుతుందని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 212 కింద పదో షెడ్యూల్లోని పేరా 6(2)లో చెప్పిన దానికి ఇది పూర్తి విరుద్ధమని ఆ ఎస్ఎల్‌పీలో ఆయన పేర్కొన్నారు. న్యాయ ప్రయోజనాల దృష్ట్యా ఎస్ఎల్‌పీపై తక్షణ విచారణ జరపాలని సుప్రీంకోర్టును సీపీ జోషి కోరారు.  
మాజీ ఉప ముఖ్యమంత్రి స‌చిన్ పైల‌ట్‌తో పాటు 19 మంది ఎమ్మెల్యేల‌పై గ‌త వార‌మే స్పీక‌ర్ అన‌ర్హ‌త వేటును ప్ర‌క‌టించారు. మూడు రోజుల్లోగా వివ‌ర‌ణ ఇవ్వాల‌ని స్పీక‌ర్ త‌న ఆదేశాల్లో పేర్కొన్నారు. అయితే స‌చిన్ బృందం హైకోర్టును ఆశ్ర‌యించింది. ఆ కేసును విచారించిన కోర్టు స‌చిన్ బృందానికి శుక్ర‌వారం వ‌ర‌కు గ‌డువు ఇచ్చింది.
దీంతో షోకాజ్ నోటీసుల‌పై స్పంద‌న ఆల‌స్యం అవుతున్న‌ద‌ని స్పీక‌ర్ జోషి ఆరోపిస్తున్నారు.  రాజస్థాన్‌లో రాజ‌కీయ సంక్షోభం ఏర్ప‌డే ప్ర‌మాదం ఉన్న‌ట్లు ఆయ‌న హెచ్చ‌రించారు. ఈ నేప‌థ్యంలోనే సుప్రీంకోర్టుకు వెళ్ల‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. త‌మ ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు స‌చిన్ పైల‌ట్ కుట్ర ప‌న్నిన‌ట్లు మరోవంక ముఖ్యమంత్రి అశోక్  గెహ్లాట్ ఆరోపించిన విష‌యం తెలిసిందే.