నేడు ఇద్దరు మంత్రుల ప్రమాణం

నేడు ఇద్దరు మంత్రుల ప్రమాణం
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గంలో కొత్త మంత్రులుగా సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ విజయవాడలోని రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం 1.29 గంటలకు వారితో పదవీ ప్రమాణం చేయిస్తారు.
 పిల్లి సుభాష్‌చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణారావు రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయిన నేపథ్యంలో మంత్రి పదవులకు చేసిన రాజీనామాలను గవర్నర్‌ ఇప్పటికే ఆమోదించిన విషయం తెలిసిందే. వారి స్థానంలో అప్పలరాజు, వేణుగోపాలకృష్ణకు మంత్రివర్గంలో అవకాశం దక్కనుంది.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన అప్పలరాజు 2019లో తొలిసారిగా పలాస నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మత్స్యకార వర్గానికి చెందిన మోపిదేవి స్థానంలో అదే సామాజిక వర్గం నుంచి అప్పలరాజుకు అవకాశం కల్పిస్తున్నారు.

శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ స్థానంలో అదే సామాజిక వర్గం నుంచి తూర్పు గోదావరికి చెందిన చెల్లుబోయిన వేణుకు పదవి దక్కనుంది. కోవిడ్‌–19 నేపథ్యంలో ప్రమాణ స్వీకారోత్సవానికి పరిమిత సంఖ్యలో అనుమతిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.