నిమ్మగడ్డను కొనసాగించాలని గవర్నర్ ఆదేశం 

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా బాధ్యతలు చేపట్టకుండా అడ్డుకొంటు వచ్చిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు అన్నట్లుగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నేడు ఆదేశాలు జారీచేశారు. హై కోర్ట్ తీర్పును అనుసరించి రమేష్ కుమార్ ను తిరిగి నియమించడంలో తగు చర్యలు తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.
కోర్ట్ ధిక్కరణ పిటిషన్ విచారణ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ను కలసి కోర్ట్ తీర్పు అమలు జరిపామని హై కోర్ట్ గత 17న సూచించడంతో సోమవారం రమేష్ కుమార్ గవర్నర్ ను కలసి వినతి పత్రం సమర్పించారు. అంతకు ముందు మే 29న తనను పదవి నుండి తొలగించడానికి దారితీసిన రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్సు చెల్లుబాటు కాదని హై కోర్ట్ ఇచ్చిన తీర్పును కూడా ప్రస్తావించారు.
 
పైగా, హై కోర్ట్ ఈర్పుపై మూడు సార్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించినా సుప్రీం కోర్ట్ స్టే ఉత్తరువు ఇవ్వడానికి తిరస్కరించడాన్ని కూడా ప్రస్తావించారు. రమేష్ కుమార్ వినతిపత్రంపై స్పందిస్తూ గవర్నర్ నేడు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేశారు. 
 
మే 29న హై కోర్ట్ ఇచ్చిన తీర్పును అమలు పరచమని గవర్నర్ తన ఆదేశంలో స్పష్టం చేశారు. గత మార్చిలో కరోనా మహమ్మారి కారణంతో స్థానిక సంస్థల ఎన్నికలను రమేష్ కుమార్ ఆరు వారాలపాటు వాయిదా వేయడంతో ఆగ్రహం చెందిన జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల కమీషన్ స్వరూపంలోనే మార్పులు టెస్టు ఆర్డినెన్సు తీసుకు వచ్చి, జస్టిస్ కనక రాజ్ ను కొత్త ఎన్నికల కమీషనర్ గా నియమించారు. 
 
అయితే హై కోర్ట్ ఆ ఆర్డినెన్సు జారీచేసే అధికారం రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. కనక రాజ్ నియామకం కూడా చెల్లదని కొట్టిపారవేసింది. దానితో తనకు తిరిగి విధులు చేపడుతున్నట్లు రమేష్ కుమార్ ప్రకటన చేసిన, ఆయనను ఎన్నికల కమీషన్ కార్యాలయంలోకి రానీయవద్దని పోలీసులను ప్రభుత్వం ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి.