విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్

విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్
వైసిపి ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డికి కరోనా సోకింది. ఇప్పటికే రాష్ట్రంలో పలువురు వైసీపీ మంత్రులు, ఎమ్యెల్యేలు కరోనా వైరస్ కు గురయ్యారు. పది రోజులపాటు హోం క్వారంటైన్ లో ఉండటం కోసం హైదరాబాద్ వెళ్లారని పార్టీ వర్గాలు తెలిపాయి.

“కరోనా పరిస్థితుల దృష్ట్యా, నాకు నేనుగా వారం నుంచి 10 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని నిర్ణయించుకున్నాను. ముందు జాగ్రత్త చర్యగా క్వారంటైన్ లో ఉండడం తప్పదు. టెలిఫోన్ లోనూ అందుబాటులో ఉండను. ఏవైనా కొన్ని అత్యవసర విషయాలకు మాత్రమే సంప్రదించగలరు” అంటూ ట్వీట్ చేశారు.

 
జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలోని రూమ్‌ నెంబర్‌ 223లో ఆయన చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. కరోనా సమయంలో విజయసాయిరెడ్డి విస్తృతంగా పర్యటించారు. నిత్యం సీఎం జగన్‌ సహా పలువురు వైసీపీ నేతలతో సమావేశాలు నిర్వహించారు. కొన్ని సందర్భాల్లో విజయసాయిరెడ్డి మాస్క్‌ కూడా ధరించలేదు. 
 
అయితే తమ పార్టీ ప్రభుత్వం ఉన్న విశాఖపట్నంలో గాని, రాష్ట్రంలో మరే ఆసుపత్రిలో గాని చేరకుండా హైదరాబాద్ కు వెళ్లడం పట్ల టిడిపి నేతలు విమర్శలు కురిపిస్తున్నారు.  వివేక హత్య కేసులో సీబీఐ పాజిటివా? అంటి టిడిపి ఎమ్యెల్సీ బుద్ధా వెంకన్న ఒక ట్వీట్ లో ఎద్దేవా చేశారు. 
 
ఇంతకు ముందు కడపకు చెందిన ఉప ముఖ్యమంత్రి అంజాబ్ బాషా, ఆయన కుమారుడు, కుమార్తె కరోనాబారిన పడిన సమయంలో సహితం ఏపీలో కాకుండా హైదరాబాద్ కు వచ్చి ఆసుపత్రిలో చేరడం విమర్శలకు దారితీసింది. తమ రాష్ట్రంలోని ఆసుపత్రులు, వైద్యులు, చికిస్థపట్ల ఉప ముఖ్యమంత్రికే నమ్మకం లేదా అనే ప్రశ్నలు తలెత్తాయి. 
 
గత నెలలో టిడిపికి చెందిన మాజీ మంత్రి కె అచ్చంనాయుడును ఎసిబి కేసులో ఒక చిన్న శస్త్ర చికిత్స చేయించుకున్న కొద్దీ సమయానికే అరెస్ట్ చేసి, ఏకంగా 600 కి మీ రోడ్ ప్రయాణంలో తీసుకు వచ్చి, కోర్ట్ ఆదేశిస్తే తప్ప ఆసుపత్రిలో చేర్చక పోవడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కోరుకొంటే, ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రమే జరగాలని ప్రభుత్వం పట్టుబడటం తెలిసిందే.