తిరుమల శ్రీవారి సేవలకు ఆటంకం తప్పదా!

కరోనా మహమ్మారి దేశం అంతా ఉగ్రరూపం దాలుస్తున్న సమయంలో తిరుమల ఆలయం భక్తులకు తెరవడం పట్ల తొలినుండి హెచ్చరికలు చేస్తున్న మాజీ ప్రధాన అర్చకుడు, టిటిడి ఆగమ సలహాదారుడు రమణ దీక్షితులు అనుమానాలు నిజం కానున్నాయా? వరుసగా అర్ధకులు వైరస్ బారిన పడుతూ ఉండడంతో శ్రీవారికి నిత్య కైంకర్యాలకే ఆటంకం ఏర్పడనున్నదా? ఇప్పుడు శ్రీవారి భక్తులు ఆందోళనకు కారణం అవుతున్నది. 

ఈ విషయంలో టీటీడీ పాలకవర్గం, అధికారులు అనుసరిస్తున్న మొండి వైఖరి కారణంగా కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతినే ప్రమాదాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులలో తిరుమల దర్శనాలను కొంతకాలం రద్దు చేసి ఏకాంతసేవలు కొనసాగించడం ఒక్కటే తరుణోపాయమని అర్చకులు, ధార్మికవేత్తలు భావిస్తున్నారు.

 అర్చకులు పెద్ద సంఖ్యలో ఇప్పటికే కరోనా బారిన పడడం, ఏకంగా కైంకర్యాల పర్యవేక్షకుడే పాజిటివ్‌ కావడం, మాజీ ప్రధాన అర్చకుడు కొవిడ్‌తో మరణించడం వంటి పరిణామాలు విధులు నిర్వహిస్తున్న అర్చకులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. 

తిరుమల ప్రధాన ఆలయంలోని శ్రీవారి మూలమూర్తితోపాటు బేడి ఆంజనేయస్వామి, వరాహస్వామి, విఖానసాచార్యుల ఆలయంలో పూజా కైంకర్యాల విధులు నిర్వహించడానికి 48 మంది అర్చకులున్నారు. జూన్‌ 8న దర్శనాలను పునరుద్ధరించిన తర్వాత వీరంతా మునుపటి లాగే విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ నెల తొలి వారం నుంచీ వీరిలో 17మంది కరోనా వైరస్‌ బారిన పడి విధులకు దూరమయ్యారు. 

మరో ఆరుగురు వివిధ కారణాలతో సెలవులో ఉండిపోయారు. మిగిలింది 25మంది అర్చకులు మాత్రమే. తిరుమలలో నిత్య కైంకర్యాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా సాగాలంటే 22-23మంది అర్చకులు విధులు నిర్వహించాల్సి ఉంటుం ది. అంటే, ఇప్పుడు విధుల్లో ఉన్న 25మంది అర్చకుల్లో ఏ ఇద్దరు, ముగ్గురు అనారోగ్యం బారిన పడినా ఉపద్రవం ముంచెత్తే అవకాశం ఉంది. 

కనీసం ఇంకో ఐదుగురు విధులకు హాజరు కాలేకపోతే నిత్య పూజా కైంకర్యాలకు ఆటంకం కలుగుతుందని ధార్మికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. తోటి అర్చకులు కరోనా బారినపడడంతో మిగిలిన వారిలో భయాందోళనలు నెలకొన్నాయి. వీరిలో ఒక సీనియర్‌ అర్చకుడు చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

ఆందోళన చెందుతున్న అర్ధకుల పట్ల టిటిడి ఉన్నతాధికారులు అనుచితంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తున్నది.  ‘‘మీరు చేయలేకపోతే చెప్పండి. వేరేవారితో పూజా కైంకర్యాలు నిర్వహిస్తాం’’ అని హెచ్చరిస్తున్నట్లు చెబుతున్నారు. 

తిరుపతి నుండి వస్తున్న వారి ద్వారానే వైరస్ తిరుమలలో వ్యాప్తి చెందుతున్నదని, భక్తుల ద్వారా కాదని టిటిడి పాలక వర్గం స్పష్టం చేస్తున్నా ఎవ్వరు విశ్వసించడం లేదు. గర్భాలయం చాలా ఇరుకైన ప్రదేశం.

భక్తులు మాస్కులు ధరించే ఆలయంలోకి వస్తున్నా శ్రీవారిని చూడగానే కొంతమంది భక్తి పారవశ్యంతో మాస్కును నోటినుంచి కిందకు జరిపి మరీ గోవింద నామస్మరణ చేస్తుంటారు. ఈ సందర్భంలో తుంపర్ల రూపంలో వైరస్‌ వాతావరణంలోకి చేరే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు.

తిరుపతిలో నివాసం ఉండే అర్చకులు రోజూ వచ్చిపోవడం వల్ల బయటనుంచి వైరస్‌ ముప్పు ఉంటుందనే ఉద్దేశంతో వారిని తిరుమల కొండమీదే ఉండాలని టీటీడీ ఆదేశించింది. ఇందుకోసం వీరికి తొలుత అర్చకనిలయంలో బస ఏర్పాటు చేశారు. అక్కడే వంట చేసి పెట్టేవారు. అయితే ఏకంగా ఈ వంటశాలలో ఇద్దరికి వైరస్‌ సోకింది.

పైగా అర్చకనిలయంలో ఒకే చోట కలిసి భోజనం చేయడం, కామన్‌ టాయ్‌లెట్స్‌, బాత్‌రూములుండడం వల్ల కూడా ముప్పు ఉందని గ్రహించి అర్చకులు టీటీడీ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళారు. దీంతో మూడురోజుల క్రితం తిరుమలలో నూతనంగా నిర్మించిన వకుళ విశ్రాంతి భవనంలో ప్రతి అర్చకుడికీ విడివిడిగా అటాచ్డ్‌ బాత్రూములున్న 30 గదులను కేటాయించారు. అయినా కూడా అర్చకుల్లో ఆందోళన తగ్గడంలేదు.