ఇప్పటికే వివిధ సందర్భాలలో రెండుసార్లు రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ ను కోర్ట్ కు పిలిచి స్వయంగా వివరణ కోరిన హై కోర్ట్ ఆంధ్ర ప్రదేశ్ పోలీసుల వైఖరి పట్ల మరోమారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చెందింది. ఓ న్యాయవాదిని అక్రమంగా నిర్బంధించారంటూ దాఖలైన అత్యవసర హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సందర్భంగా సోమవారం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఒక న్యాయవాది పట్లే ప్రభుత్వ యంత్రాంగం ఇలాంటి దురాగతానికి పాల్పడితే సాధారణ పౌరులపరిస్థితిని అవగతం చేసుకోవడం కష్టమేనని కటువుగా వ్యాఖ్యానించింది. తన భర్త కోసం న్యాయవాది భార్యే హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడం తీవ్ర దిగ్బ్రాంతి గొలుపుతోందని పేర్కొంది.
సాక్షాత్తు రాష్ట్ర డీజీపీయే తమ ముందుకొచ్చి ఇక మీదట ఇలాంటి ఉల్లంఘనలు జరుగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పినా ఫలితం లేకపోయిందని, ఇంకా అలాంటి అక్రమ నిర్బంధాలు కొనసాగుతూనే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ వ్యవహారంలో సదరు న్యాయవాదిని మంగళవారం ఉదయం తమ ముందు హాజరుపరచాలని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీని ఆదేశించింది.
అదేవిధంగా ఎలాంటి నిబంధనలు పాటించకుండా, ఎలాంటి ఆదేశాలూ లేకుండా అర్ధరాత్రి ఒంటిగంటకు పిటిషనర్ ఇంట్లోకి ఎందుకు చొరబడాల్సివచ్చిందో, ఆ పరిస్థితి ఎందుకు తలెత్తిందో వివరణ ఇవ్వాలనీ తేల్చి చెప్పింది.. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్‌కుమార్, జస్టిస్ కె.సురేశ్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆదివారం అర్ధరాత్రి తన భర్త న్యాయవాది సుభా్‌షచంద్రబో్‌సను తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు, ఏలేశ్వరం పోలీసులు అక్రమంగా నిర్బంధంలోకి తీసుకున్నారని, అర్ధరాత్రి తమ ఇంటికొచ్చి తలుపులు పగులగొట్టి దౌర్జన్యంగా తీసుకెళ్లారని పేర్కొంటూ పి.వెంకట ప్రియదీప్తి సోమవారం అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించారు.
తన మామ పైలా సత్యనారాయణ గతంలో ఏలేశ్వరం మున్సిపల్ వైస్‌చైర్మన్‌గా వ్యవహరించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. తన భర్తకు అధికార పార్టీ నేతలతో రాజకీయ విభేదాలున్నాయని, గతంలో కూడా పోలీసులు బెదిరించడంతో ఆయన జాతీయ మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారని తెలిపారు.
ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి ఒంటిగంటకు ప్రత్తిపాడు సీఐ, ఏలేశ్వరం ఎస్సైలు, కానిస్టేబుళ్లు బలవంతంగా ఇంట్లోకి వచ్చి తన భర్తను దౌర్జన్యంగా తీసుకెళ్లారని తెలిపారు. ఎందుకు అరెస్టు చేస్తున్నారో, ఎక్కడకు తీసుకెళ్తున్నారో కూడా తమకు సమాచారం ఇవ్వలేదని ఆమె వాపోయారు. తన భర్తను కోర్టులో హాజరు పరచాలని, చట్టవిరుద్ధంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని వెంకట ప్రియదీప్తి కోర్టును అభ్యర్థించారు.
More Stories
బుడమేరుకు మళ్లీ వరద ముప్పు
ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం
ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక