హ్యాకింగ్‌పై ట్విట్టర్‌కు భారత్ నోటీసు   

అంతర్జాతీయ స్థాయిలో ట్విట్టర్ ఖాతాల హ్యాకింగ్ ప్రకంపనలు భారత్‌లో చోటుచేసుకున్నాయి., ఒబామా, బిల్‌గేట్స్, జో బిడెన్, ఇతర అంతర్జాతీయ స్థాయి ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలపై ఇటీవలే సైబర్ నేరగాళ్లు దాడికి దిగారు. ఈ క్రమంలో భారతదేశానికి చెందిన ప్రముఖ వ్యక్తులు, యుజర్ల సమాచార గోప్యతపై దేశ సైబర్ భద్రతా వ్యవహారాల ప్రధాన సంస్థ సిఇఆర్‌టి స్పందించింది.
ఇటీవలి హ్యాకింగ్ పరిణామంపై తమకు పూర్తి స్థాయి సమాచారం అందించాలని ట్విట్టర్ యాజమాన్యానికి నోటీసులు పంపించింది. ఎంత మంది భారతీయ యుజర్లు ఈ హ్యాకింగ్‌తో బాధితులు అయ్యారు? వారి డాటా భద్రంగా ఉందా? ఎటువంటి తదుపరి చర్యలు తీసుకుంటున్నారు? వంటి పలు అంశాలను తమకు తెలియచేయాలని సిఇఆర్‌టి ఈ సమన్లలో పేర్కొంది.
ఇటీవలి కాలంలో భారతీయ ట్విట్టర్ యుజర్లలో కొందరికి తప్పుడు ట్వీట్లు అందడం, వేర్వేరు లింక్‌లకు తమ ట్వీట్లు పోవడం వంటివి జరిగాయి. దీనిని పరిగణనలోకి తీసుకున్న దేశ సైబర్ సెక్యూరిటీ సంస్థ రంగంలోకి దిగింది. ముందుగా ప్రపంచ స్థాయిలో సెలబ్రిటీల ట్విట్టర్ ఖాతాల హ్యాకింగ్ సమాచారం అందించాలని ఈ క్రమంలో భారతదేశంలో యుజర్ల డాటా ఏ మేరకు భద్రంగా ఉందనేది తెలియచేయాలని ట్విట్టర్ యాజమాన్యాన్ని ఆదేశించారు.
ట్విట్టర్‌ను అనధికారికంగా ఇతరులు వాడుకుంటున్నట్లు దేశం నుంచి ట్విట్టర్ నిర్వాహకులకు ఏమైనా ఫిర్యాదులు అందాయా? లేదా అనేది తెలియచేయాలని సూచించారు. దీనితో తమకు ఎందరు ఈ హ్యాకింగ్‌కు బాధితులు అయ్యారనేది తెలుస్తుందని సంస్థ ప్రతినిధి ఒకరు అనధికారికంగా తెలిపారు.
సైబర్ నేరగాళ్లు ఏ విధమైన పద్దతిలో దాడికి దిగుతున్నారు? యుజర్లు తీసుకోవల్సిన జాగ్రత్తలు ఏమిటనేది తెలియచేయాలని కూడా కోరారు. భారత ప్రభుత్వ అధికారిక సంస్థ నుంచి అందిన సమన్లపై ట్విట్టర్ యాజమాన్యం ఇప్పటికైతే స్పందించలేదు.
అయితే హ్యాకింగ్ అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టించడంతో వెంటనే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సిఇఆర్‌టి ఇన్) రంగంలోకి దిగింది. హ్యాకర్లు అంతర్జాతీయ స్థాయిలో కార్పొరేట్ ప్రముఖులు, రాజకీయ దిగ్గజాలను టార్గెట్ చేసుకోవడం, కొందరు సినిమా తారల ట్విట్టర్లను కూడా హ్యాక్ చేయడంతో తలెత్తిన పరిణామాలను ఈ రెస్పాన్స్ టీం జాగ్రత్తగా పరిశీలిస్తోంది.