
దర్శనాలు ప్రారంభించాక టీటీడీలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే 140 మందికి పాజిటివ్ వచ్చిందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
పాజిటివ్ వచ్చిన వారిలో అర్చకులు, టీటీడీ ఉద్యోగులు, ఎస్టీఎఫ్ సెక్యూరిటీ సిబ్బంది, లడ్లు తయారు చేసే సిబ్బంది ఉన్నారని వెల్లడించారు.
కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో 70 మంది కోలుకుని హోంక్వారంటైన్‌లో ఉండగా, క్వారంటైన్‌లో ఉన్నవారిలో ఒక్కరు మినహా అందరు ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. ప్రధానంగా 40 మంది అర్చకుల్లో 14 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని.. 60 సంవత్సరాలు నిండిన అర్చకులకి విధుల నుండి సడలింపు ఇచ్చామని తెలిపారు.
కాగా, ఈ విషయమై రమణ దీక్షితులు చేసిన ట్వీట్‌కు రాజకీయ రంగు పులమకండని, గౌరవ ప్రధాన అర్చకులుగా ఉండి ఇలా ట్వీట్ చేయటం మంచి పద్దతి కాదని సూచించారు. ఏమైనా సమస్య ఉంటే రమణ దీక్షితులుతో కూడా చర్చిస్తామని తెలిపారు.
అర్చకులకి ప్రమాదకరమైన పరిస్థితి నెలకొంటే దర్శనాలు కూడా ఆపివేస్తామని స్పష్టం చేశారు. అర్చకులు బాగుంటేనే శ్రీవారి కైంకర్యాలు సక్రమంగా జరుగుతాయని, దర్శనాల సంఖ్య తగ్గించడం, పెంచడం ఉండదని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
ఇలా ఉండగా, అంతకు ముందు రమణ దీక్షితులు ట్విట్టర్ వేదికగా టీటీడీ అధికారులపై విరుచుకుపడ్డారు. శ్రీవారి ఆలయంలో విధులు నిర్వర్తించే అర్చకులలో 15 మంది కరోనా బారిన పడ్డారని, ఇంకా 25 మందికి చెందిన ఫలితాలు రావాల్సి ఉందని తెలిపారు.
దర్శనాలు నిలిపివేసేందుకు టీటీడీ అధికారులు నిరాకరిస్తున్నారని, మాజీ సీఎం చంద్రబాబు పాటించిన అర్చక వ్యతిరేక, బ్రాహ్మణ వ్యతిరేక విధానాలనే టీటీడీ అధికారులు కూడా పాటిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించకపోతే ఉపద్రవం చోటుచేసుకుంటుందని రమణ దీక్షితులు హెచ్చరించారు.
More Stories
తన తండ్రి హత్యా కేసుపై గవర్నర్ కు డా. సునీత ఫిర్యాదు
అవిశ్వాస తీర్మానంకు భయపడి గుంటూరు మేయర్ రాజీనామా
మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చాను