గవర్నర్ కోర్ట్ లోకి నిమ్మగడ్డ వ్యవహారం

గత నాలుగు నెలలుగా వివాదాస్పదంగా మారిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా తొలగింపు వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు చేరుకొంది. ఇప్పుడు గవర్నర్ జోక్యం చేసుకొని ఒక నిర్ణయం తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.  
 
ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల కమీషన్ లో వ్యవస్థాగత మార్పులు తీసుకు వస్తూ గతంలో రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్సు రాజ్యాంగ వ్యతిరేకం అని కొట్టివేసిన హై కోర్ట్ ఈ విషయంలో ఇక రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఏమీ లేదని మరో మారు స్పష్టం చేసింది. 
 
హైకోర్టులో  రమేష్ కుమార్ వేసిన కోర్టు ధిక్కరణ పిటీషన్ కు సంబంధించి శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. రమేష్ కుమార్ ను ఏపీ గవర్నర్ ను కలవాల్సిందిగా ఆదేశించింది. గవర్నర్ కు వినతిపత్రం అందజేయాలని సూచించింది.  ఎస్ఈసీని నియమించే అధికారం ఆయనకే ఉందని స్పష్టం చేసింది.
హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వటానికి సుప్రీంకోర్టు మూడు పర్యాయాలు నిరాకరించినా కూడా ఎందుకు హైకోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదని అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై మరోమారు ఆగ్రహాం వ్యక్తం చేసింది.  స్టే ఇవ్వలేదు కాబట్టి, తాము ఇచ్చిన తీర్పు అమల్లో ఉన్నట్లేనని హైకోర్టు స్పష్టం చేసింది. ధర్మాసనం తీర్పు అమలు జరపాల్సిందేనని  స్పష్టం చేసింది.
 
అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ తరపున వాదనలు విన్పించిన లాయర్ అశ్వనీ కుమార్ తాము ఇఫ్పటికే గవర్నర్ అపాయింట్ మెంట్ కోరినట్లు కోర్టుకు నివేదించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటీషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఏపీ సర్కారును ఆదేశించింది. తిరిగి ఈ కేసును వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.