మాజీ మంత్రి పుల్లారావు చుట్టూ ఉచ్చు 

ఇప్పటికే టిడిపి హయాంలోని ఇద్దరు మాజీ మంతృలు – కె అచ్చంనాయుడు, రవీంద్రలను జైళ్లకు పంపిన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కుమారుడిపై కేసు పెట్టడం ద్వారా మరో మాజీ మంత్రి పితాని సత్యనారాయణపై వల విసిరారు. తాజాగా ఇంకో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై ఉచ్చు బిగుసుకొంటున్నది. 

రాష్ట్ర రాజధాని అమరావతిలో భూ కుంభకోణం వ్యవహారాలలో బుధవారం ఆయనకు సన్నిహితులైన ఇద్దరినీ అరెస్ట్ చేయడంతో టిడిపి వర్గాలలో కలకలం రేపుతున్నది. తుళ్లూరు మాజీ తహశీల్దార్‌ అన్నే సుధీర్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు విజయవాడకు చెందిన వ్యాపారవేత్త గుమ్మడి సురేష్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. 

వీరిద్దరూ అప్పటి మంత్రి పత్తిపాటి పుల్లారావుకు అనుకూలంగా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. వైసిసి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తరువాత భూ కుంభకోణాలపై ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తు బాధ్యతను సిఐడికి అప్పగించింది. వీరిద్దరిని మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టగా ఈ నెల 29 వరకు న్యాయస్థానం రిమాండ్‌ విధించింది. దీంతో సురేశ్‌, సుధీర్‌ బాబును గుంటూరులోని జైలుకు తరలించారు.

ఈ నేపథ్యంలో విచారణ జరిపిన అధికారులు రాయపూడి పెదలంకలో సర్వే నెంబరు 376-2ఏలో ఉన్న అసైన్డ్‌ భూములను పట్టా భూములుగా మార్చి అమ్మకాలు జరిపినట్లు గుర్తించింది. 2014-2017గా తుళ్లూరు తహశీల్దారుగా అన్నే సుధీర్‌బాబు పనిచేశారు. 

ఆయన హయాంలోనే గుమ్మడి సురేష్‌కు అనుకూలంగా భూముల రికార్డులు తారుమారు చేసినట్లు స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ బృందం అధికారులు నిర్ధారణకు వచ్చారు. గుమ్మడి సురేష్‌ వ్యాపారరీత్యా మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు బినామీగా వ్యవహరించారని అప్పట్లో కథనాలచ్చాయి. 

సురేష్‌ విజయవాడలో ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థలో భాగస్వామి. పుల్లారావుకు కూడా స్పిన్నింగ్‌ మిల్లుల వ్యాపారం ఉండటంతో వారిద్దరికి ఉమ్మడి లావాదేవీలు ఉన్నట్లు గుర్తించారు. టిడిపి ప్రభుత్వ హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత సన్నిహితంగా మెలిగిన సుధీర్‌ బాబు టీడీపీ నాయకులతో కలిసి రికార్డులు తారుమారు చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

కాగా అమరావతి ల్యాండ్‌ పూలింగ్‌లో అక్రమాలు, తప్పుడు రికార్డులు సృష్టించిన నేపథ్యంలో సీఆర్‌డీఏ నెక్కల్లు డిప్యూటీ కలెక్టర్‌ కనికెళ్ల మాధురిని పోలీసులు ఇదివరకే అరెస్టు చేసారు. త్వరలో మరో ముగ్గురు స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లనూ అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. టిడిపి హయాంలో భూసమీకరణ సమయంలో పెద్దఎత్తున భూములు చేతుల మారిన సంగతి తెలిసిందే.