కల్యాణ ఆశ్రయం అధ్యక్షుడు జగదేవరం మృతి 

వనవాసి కళ్యాణ్ ఆశ్రమం అఖిల భారతీయ అధ్యక్షుడు జగదేవరం ఉరొంజి (72) జష్పూర్ నగర్ లోని కళ్యాణ్ ఆశ్రమం కేంద్ర కార్యాలయంలో  బుధవారం మధ్యాన్నం హుద్రోగంతో మృతి చెందారు. ఆశ్రమ ప్రధాన కార్యాలయానికి 3 కిమీ దూరంలో గల ఉరన్ గ్రామానికి చెందినవారు. ఆయనకు ముగ్గురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. 
 
కొద్దీ సంవత్సరాలుగా ఆయన కిడ్నీ, హుద్రోగ సమస్యలతో బాధపడుతున్నారు. కల్యాణ ఆశ్రయం వ్యవస్థాపకులు బాబాసాహేబ్ దేశపాండే మృతి చెందిన తర్వాత 1995 నుండి ఆయన ఈ సంస్థకు నేతృత్వం వహిస్తున్నారు. 
 
కళ్యాణ్ ఆశ్రమం తన కార్యకలాపాలను దేశ వ్యాప్తంగా విస్తరింప చేసిన సమయంలో 80వ  దశకంలో ఆయన దేశపాండేతో కలసి దేశ వ్యాప్త పర్యటనలలో పాల్గొన్నారు. చాలాకాలం ఆశ్రయంకు ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆయన 1993లోకటక్ లో జరిగిన జాతీయ మహాసథలలో కార్యనిర్వాహక అద్యక్షులయ్యారు. 
 
ఆశ్రయం చేపట్టిన వివిధ కార్యక్రమాలకు ఆయన  నేతృత్వం వహించారు. ఆయన నాయకత్వంలో విజన్ పత్రం జనజాతిస్ ను తీసుకు వచ్చారు. జనజాతి యువతకు ప్రతి సంవత్సరం క్రీడా ఉత్సవాలు, పోటీలు నిర్వహిస్తున్నారు.
 
 ప్రయాగలో కుంభమేళా, ఉజ్జయినిలో సింహస్త్ కుంభ సమయాలలో వనవాసి సాంస్కృతిక కార్యక్రమాలు శబరీ కుంభ్ లను నిర్వహిస్తున్నారు. 2004లో ఝాబువా వద్ద వనవాసి సమ్మేళనం, భోపాల్ లోని మఖంలాల్ చతుర్వేది పాత్రకారిత యూనివర్సిటీతో కలసి “వనవాసీయుల పట్ల దృష్టి, వాస్తవం” అంశంపై సెమినార్ వంటి విశిష్టమైన కార్యక్రమంలో ఆయన ఆధ్వర్యంలో జరిగాయి. 
 
ఆయన నాయకత్వంలో కళ్యాణ్ ఆశ్రమ అవసరంలో ఉన్నవారి కోసం అనేక సేవా, సహాయ కార్యక్రమాలు చేపట్టింది. దేశంలో 500 జనజాతి సమూహాలకు వ్యాపించి జాతీయస్థాయి సంస్థగా కల్యాణ ఆశ్రయంను అభివృద్ధి చేశారు. 
 
ఇప్పుడు 50,000 గ్రామాలలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా 14,000 కు పైగా గ్రామాలలో 20,000కు పైగా ప్రాజెక్ట్ లను నిర్వహిస్తున్నది. దేశ వ్యాప్తంగా ఆయన మృతి తీవ్ర దిగ్భ్రాంతిని, విషాదాన్ని కలిగించింది. నేడు ఆయన అంత్యక్రియలు జరుపుతున్నారు.