బ్రహ్మపుత్ర కింద వ్యూహాత్మకంగా  భారీ సొరంగం 

చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఆ దేశ సరిహద్దుకు సమీపంలో బ్రహ్మపుత్ర నది కింద వ్యూహాత్మకంగా కీలకమైన టన్నెల్‌ (సొరంగం) నిర్మాణానికి ఆమోదం తెలిపింది. నాలుగు లేన్లు ఉండే ఈ టన్నెల్ అసోంలోని గోహ్‌పుర్‌, నుమాలీగఢ్‌లను కలుపుతుంది. 

అండర్‌ వాటర్‌ టన్నెల్‌ను భారత్‌ నిర్మించడం ఇదే తొలిసారి. జియాన్షు ప్రావిన్స్‌లో తైహు సరస్సు అడుగున చైనా నిర్మిస్తున్న సొరంగం (10.79 కిలోమీటర్లు) కంటే ఇది పెద్దది కావడం విశేషం. ఈ టన్నెల్‌ పూర్తయితే అరుణాచల్‌ ప్రదేశ్‌, అసోం మధ్య ఏడాది పొడవునా కనెక్టివిటీ ఉంటుంది. 

మిలిటరీ సామగ్రి, ఆయుధాలను వేగంగా తరలించేందుకూ వీలవుతుంది. సొరంగం ద్వారా వాహనాలు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వీలుంది. 14.85 కిలోమీటర్ల పొడవుండే ఈ సొరంగ నిర్మాణాన్ని డిసెంబర్‌లో మొదలుపెట్టనున్నారు. 

మరోవంక, తూర్పు లఢక్‌లో అన్ని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి నిర్దిష్ట వ్యవధిలోగా బలగాలను ఉపసంహరించడంపై భారత్‌, చైనా సైనికాధికారులు మంగళవారం కీలక దశ సంప్రదింపులను ప్రారంభించారు. వాస్తవాధీన రేఖకి భారత్‌ వైపున ఉన్న చుషుల్‌లో నాలుగో దఫా లెఫ్టినెంట్‌ జనరల్‌ స్థాయి చర్చలు మొదలయ్యాయి. 

నిన్న ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన భారత్‌-చైనా కోర్‌ కమాండర్‌ స్థాయి చర్చలు, ఈ రోజు తెల్లవారుజామున 2 గంటల సమయంలో పూర్తయ్యాయి. సుమారు 15 గంటలపాటు ఈ సమావేశం కొనసాగింది. గల్వాన్‌ లోయలో ఉద్రిక్తతలు మొదలైన తర్వాత ఇరు దేశాల మధ్య ఇంత సుదీర్ఘంగా చర్చలు జరగడం ఇదే మొదటిసారి.