ఏపీలో వచ్చే మార్చి లోగా కొత్త జిల్లాలు 

వచ్చే ఏడాది మార్చి 31వ తేదీలోగా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమై ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు కొత్తజిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. 
 
కొత్త జిల్లాల ఏర్పాటుకు అధ్యయన కమిటీ ఏర్పాటుపై మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతత్వంలో కొత్త జిల్లా ఏర్పాటుకు అధ్యయన కమిటీ ఏర్పాటయింది. 
సీసీఎల్‌ఏ కమిషనర్, జీఏడీ సర్వీసుల సెక్రటరీ, ప్లానింగ్‌ విభాగం సెక్రటరీ, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రతినిధి, కన్వీనర్‌గా ఫైనాన్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. వీలైనంత త్వరలో నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి కమిటీని ఆదేశించారు.
పార్లమెంట్‌ నియోజకవర్గం సరిహద్దుగా కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో 13 జిల్లాలను పునర్వ్యవస్థీకరించి 25 జిల్లాలు ఏర్పాటు చేయనున్నారు. అయితే 26వ జిల్లా ఏర్పాటుకు సంబంధించి కూడా మంత్రి మండలి సమావేశంలో చర్చకు వచ్చింది.
కొత్తగా ఏర్పాటు కానున్న అరకు జిల్లా భౌగోళికంగా ఎక్కువ విస్తీర్ణం కలిగి ఉందని డిప్యూటీ సిఎం పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. 4 జిల్లాలకు అరకు జిల్లా ప్రాంతం విస్తరించి ఉందని సిఎం దష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో అరకును రెండు జిల్లాలు చేసేందుకు అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
వెనుకబడిన ప్రాంతాలను అభివద్ధి చేయాలన్న లక్ష్యంతో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నామని సిఎం తెలిపారు. పైగా,  జిల్లాల ఏర్పాటులో నేతల ప్రమేయం లేకుండా అధికారులకే పూర్తి బాధ్యతలు అప్పగించనున్నాట్లు తెలిసింది.