కాంగ్రెస్ పార్టీకి తన డిమాండ్లు ఏమీ పెట్టలేదని, ఆత్మగౌరవంతో పనిచేసేందుకు అవకాశం కల్పించాలని మాత్రమే కోరానని రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రిగా తొలగించిన అనంతరం ఒక ఇంటర్వ్యూలో సచిన్ పైలట్ చెప్పారు.
తనకు జరుగుతోన్న అన్యాయాన్ని హై కమాండ్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో తన వర్గం ఎమ్యెల్యేలతో కలసి మంతనాలు జరుపుతుంటే వేటు వేశారని విస్మయం వ్యక్తం చేశారు.
సమస్యను సోనియా, రాహుల్ గాంధీల దృష్టికి తీసుకెళ్లలేదని, కేవలం ప్రియాంక గాంధీ మాత్రం తనతో ఫోన్‌లో మాట్లాడారని చెబుతూ ఆమె కూడా కానీ సమస్యకు పరిస్కారంగురించి కాకుండా వ్యక్తిగత విషయాలపై మాట్లాడారని చెప్పారు.
రాజస్తాన్ ప్రభుత్వంలో, పార్టీ పరంగా జరుగుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ దృష్టికి తీసుకెళ్లానని, రాజస్తాన్ కాంగ్రెస్ ఇంచార్జీ, ఇతర నేతలతో కూడా మాట్లాడానని, కానీ ప్రయోజనం లేకపోయినదని పేర్కొన్నారు.
తనపై దేశద్రోహ ఆరోపణలతో నోటీసులు పంపించారని వాపోయారు. ఇక్కడే కాదు ఎక్కడైనా సొంత మంత్రికి ఇలా నోటీసులు పంపించారా అని అడిగారు. అయితే సీఎల్పీ భేటీ పార్టీ కార్యాలయంలో జరగాలి కదా.. సీఎం నివాసంలో జరగడం ఏంటీ అని ప్రశ్నించారు.
రాజస్తాన్ అభివృద్ది కోసం తనను గౌరవంగా గెహ్లట్ పనిచేయనీయలేదని పైలట్ మండిపడ్డారు. తన మాటను ఐఏఎస్‌లు వినకుండా చేశారని, తన సొంత శాఖకు సంబంధించి ఫైళ్లు కూడా తన వద్దకు వచ్చేవి కాదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రివర్గం సమావేశం, సీఎల్పీ మీటింగ్ నెలలుగా జరగకపోవడంలో అర్థమేంటని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు పనిచేయకుంటే ఏం లాభం అని ప్రశ్నించారు.
గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవీకి రాహుల్ గాంధీ రాజీనామా చేసే వరకు తనను ఏమీ అనని గెహ్లట్ బృందం ఆ తర్వాత వేధించడం ప్రారంభించిందని పైలట్ ఆరోపించారు. ఏఐసీసీ కోటరి చుట్టూ గెహ్లట్ బృందం చేరి తన ఆత్మగౌరవం దెబ్బతీసే ప్రయత్నం చేసిందని ధ్వజమెత్తారు.
ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీతో కలిసి కుట్రపన్నుతున్నట్లు తనపై చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని సచిన్ పైలట్ స్పష్టం చేశారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ విజయానికి ఎంతో శ్రమించిన తాను పార్టీకి వ్యతిరేకంగా ఆ పని ఎలా చేస్తానని ఆయన ప్రశ్నించారు.
More Stories
జాతీయ రహదారులపై క్లీన్ టాయిలెట్స్, బేబీ కేర్ రూమ్స్
50 మంది సీనియర్ డాక్టర్ల మూకుమ్మడి రాజీనామా
హర్యానాలో వరుసగా మూడోసారి బీజేపీ అద్భుత విజయం