సచివాలయం కూల్చివేతలో గుప్త నిధుల దుమారం  

హైకోర్టు సచివాలయం కూల్చివేతకు అనుమతి ఇవ్వగానే ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అర్ధాంతరంగా అర్ధరాత్రి, భారీ బందోబస్తు మధ్య అత్యంత రహస్యంగా సచివాలయం కూల్చివేత పనులు మొదలు పెట్టడం గురించి పలు అనుమానాలు చెలరేగుతున్నాయి. 

ఈ సందర్భంగా ఎఫ్ బ్లాక్ కింద ఉన్నాయి భావిస్తున్న గుప్త నిధుల గురించి పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భారీ ఎత్తున పోలీసులను మోహరింప చేసి డిజిపి, పోలీస్ కమీషనర్ ల పర్యవేక్షణలో, కర్ఫ్యూ వంటి వాతావరణం సృష్టించి, మీడియా వారితో పాటు అధికారులు ఎవ్వరిని సహితం అటువైపు రానీయకుండా చేశారు. 

అక్కడ పనిచేస్తున్న వారిని, విధులలో ఉన్నవారిని మొబైల్ ఫోనులు కూడా తీసుకు రానీయ లేదు. ఇదంతా చేయడం వెనుక రహస్య ఎజెండా ఏమైనా ఉన్నదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. 

ఒకేసారి బాంబులతో కుప్పకూల్చకుండా జీ బ్లాక్ ను ప్రొక్లెయినర్లతో ఎందుకు పడగొట్టారు? అర్ధరాత్రి గుప్త నిధుల కోసం తవ్వినట్టు అందరినీ అటు వైపు రాకుండా  ఎందుకు నిషేధించారు? అసలు ఆ జీ బ్లాక్ రహస్యమేంటి? ఇప్పుడు ఇవే అనుమానాలు సర్వత్రా కలుగుతున్నాయి.

తెలంగాణ సచివాలయంలోని ‘జీ బ్లాక్’ను 132 ఏళ్ల కిందట 1888లో ఆరో నిజాం నవాబు మహబూబ్ అలీఖాన్  నిర్మించారు. నాడు సైఫాబాద్ ప్యాలెస్ గా దీన్ని పిలిచేవారు. నాడు నిజాం రాజ్యం ఆర్థిక వ్యవహారాలు, ట్రెజరీ కార్యకలాపాలు ఈ జీ బ్లాక్లోనే జరిగేవి. నిజాం రిజర్వ్ బ్యాంక్ గా జీ బ్లాక్ ఉండేది. 

2012, 2016లలో సచివాలయం సమీపంలోని హోంసైన్స్ కాలేజీ, విద్యారణ్య పాఠశాలల ఆవరణల్లో నిర్మాణాల కోసం తవ్వకాలు జరిగినప్పుడు సొరంగాలు బయటపడ్డాయి. దీంతో రంగ ప్రవేశం చేసిన పురావస్తు శాఖ మింట్ కాంపౌండ్ నుంచి మరో సొరంగం ఉన్నట్టు గుర్తించింది. ఈ మూడు సొరంగాలు జీ బ్లాక్ కింద వరకు ఉండడాన్ని గుర్తించారు.

ఈ జీ బ్లాక్ ను నాడు నిజాం రిజర్వ్ బ్యాంక్ గా ఉపయోగించాడు. భూగర్భంలో స్ట్రాంగ్ రూములు నిర్మించినట్టు పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. జి బ్లాక్ కింద నిధి ఖచ్చితంగా ఉంటుందని పురావస్తు శాఖ అంటోంది. నిజాం సంపద విలువ వేల కోట్ల మేరకు ఉంటుందని అంచనా. 
 
సొరంగాలపై పరిశోధనకు పురావస్తుశాఖ అనుమతి కోరినా కేసీఆర్ ప్రభుత్వం అప్పట్లో ఇవ్వక పోవడం, ఇప్పుడు రహస్యంగా తవ్వకాలు సాగించడం గమనార్హం.  పైగా ఈ జీ బ్లాక్ కూల్చివేసే సమయాల్లో కేసీఆర్ హైదరాబాద్ లో లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది.