ఆన్‌లైన్‌ తరగతులకు పరిమితులు 

కరోనా మహమ్మారి నేపథ్యంలో పాఠశాలలు నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ తరగతులకు సంబంధించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (హెచ్చార్డీ)  మార్గదర్శకాలను ప్రకటించింది. విద్యార్థులకు ఒక రోజులో నిర్వహించాల్సిన ఆన్‌లైన్‌ సెషన్స్‌పై పరిమితులను విధించింది.
రెగ్యులర్‌ తరగతుల మాదిరిగానే పాఠశాలలు ఆన్‌లైన్‌ క్లాసులను నిర్వహిస్తున్నాయని, దీని వల్ల పిల్లల స్క్రీన్‌ టైమ్‌ (కంప్యూటర్‌, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాల ముందు కూర్చొనే సమయం) బాగా పెరిగిందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో హెచ్చార్డీ ఈ మార్గదర్శకాలను రూపొందించింది.
‘కరోనా సంక్షోభం కారణంగా బడులను మూసివేయడంతో దేశవ్యాప్తంగా 24 కోట్ల మంది విద్యార్థులపై ప్రభావం పడింది. పాఠశాలల మూసివేత ఇలాగే కొనసాగితే వారు చదువుకు దూరమయ్యే ప్రమాదముంది’ అని  కేంద్ర మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 
సంక్షోభ ప్రభావాన్ని తగ్గించేందుకు పాఠశాలలు తమ బోధనా పద్ధతులను మార్చుకోవాల్సిన అవసరం ఉన్నదని స్పష్టం చేశారు. ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఈ గైడ్‌లైన్స్‌ రోడ్‌మ్యాప్‌లా దోహదపడుతాయని ఆయన పేర్కొన్నారు.
డిజిటల్ విద్య  సమయంలో విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యం, సైబర్‌ భద్రత, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై పాఠశాల లు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులకు మార్గదర్శకాల్లో సూచనలు చేశారు. 
కాగా, కరోనా నేపథ్యంలో స్వస్థలాలకు వెళ్లిన వలస కార్మికుల పిల్లల చదువుకు సంబంధించి కేంద్రం  అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీచేసింది. ఈ విద్యార్థులకు గుర్తింపు ధ్రువీకరణ పత్రం మినహా టీసీ (ట్రాన్ఫర్‌ సర్టిఫికెట్‌) వంటి ఇతర పత్రాలేవీ అడుగకుండా ప్రవేశాలు కల్పించేలా అన్ని బడులకు ఉత్తర్వులివ్వాలని సూచించింది.