కేరళలోని తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభస్వామి ఆలయంలో లక్షల కోట్ల విలువైన సంపద ఉన్నట్లు తెలిసిందే. ఆ ఆస్తులపై సుప్రీంలో 9 ఏళ్ల క్రితం కేసు నమోదు అయ్యింది. అయితే ఆ కీలకమైన కేసులో ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. చరిత్రాత్మకమైన ఆలయం ఆస్తుల్లో.. ట్రావెన్‌కోర్ రాచ కుటుంబానికి హిందూధర్మ చట్టం ప్రకారం హక్కు ఉన్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది.
ఒకరి మరణం వల్ల దైవారాధనకు చెందిన హక్కులు ఆ కుటుంబంపై ప్రభావం చూపవని, ఇది ఆచారం ప్రకారం కొనసాగుతుందని సుప్రీం పేర్కొన్నది. దేవుడి ఆస్తులపై రాజ కుటుంబానికి ఆచారం ప్రకారమే హక్కు ఉన్నట్లు కోర్టు వెల్లడించింది. కాగా; తిరువనంతపురం, జిల్లా జడ్జి నేతృత్వంలో తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేసి.. కొత్త కమిటీ ఏర్పాటు చేసే వరకు ఆలయ నిర్వహణను ఆ కమిటీకి అప్పగించాలని కోర్టు ఆదేశించింది.
ఆ ఆలయం వెనుక భాగంలో ఉన్న రెండవ నేలమాలిగలో మరింత విలువైన సంపద ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పద్మనాభస్వామి కేసు ఆసక్తికరంగా మారింది. ఆలయ ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం స్పందించలేదు. ఇవాళ్టి తీర్పులో ఆ అంశాన్ని కోర్టు స్పృశించలేదు. జస్టిస్ ఉదయ్ యూ లలిత్, ఇందూ మల్హోత్రలకు చెందిన ధర్మాసనం ఈ కేసును విచారించింది.
2011లో సుప్రీం కోర్టు పర్యవేక్షణలో పద్మనాభస్వామి ఆలయంలో ఉన్న అయిదు నేలమాలిగలను తెలిచారు. ఆ నేలమాలిగల్లో లక్షల కోట్ల సంపద ఉన్నట్లు గుర్తించారు. జ్వలరీ, విగ్రహాలు, ఆయుధాలు, పరికరాలు, నాణాలు ఉన్నట్లు తేల్చారు. కానీ అత్యంత వివాదాస్పదంగా, ఉత్కంఠభరితంగా మారిన బి నేలమాలిగ గురించి కోర్టు ఏం చెబుతుందన్నది వాస్తవానికి ఆసక్తిగా మారింది.
ఆ నేలమాలిగ వద్ద నల్లత్రాచులు పహారా కాస్తున్నట్లు కొన్ని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. దీన్ని తెరిచినవాళ్లను మరణం వెంటాడుతుందన్న కథలు కూడా ఉన్నాయి. 1931లో ఒకసారి ఈ నేలమాలిగను తెరిచే ప్రయత్నం చేశారని, ఆ సమయంలో దాన్ని తెరిచిన వారు నల్లత్రాచుల నుంచి ప్రాణాలతో తప్పించుకునేందుకు పరుగులు పెట్టినట్లు ప్రచారంలో ఉన్నది.
ఆలయ ఆస్తులను ఆడిట్ చేసేందుకు నియమితులైన క్యాగ్ మాజీ చీఫ్ వినోద్ రాయ్ ఆ కథనాలను కొట్టిపారేశారు. 1990 నుంచి బి నేలమాలిగను ఏడు సార్లు ఓపెన్ చేసినట్లు ఆయన తన నివేదికలో వెల్లడించారు. పద్మనాభస్వామి ఆలయంలో అక్రమాలు జరిగినట్లు కేసు నమోదు అయ్యింది. దీంతో ఆ ఆలయం పరిపాలనా, నిర్వహణ అంశంపై కేసు సుప్రీంకోర్టులో తొమ్మిది ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్నది.
2011లో ట్రావెన్‌కోర్ రాజ వంశానికి చెందిన చివరి వ్యక్తి మరణించడంతో.. ఆలయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. దీన్ని వ్యతిరేకిస్తూ మార్తాండ వర్మ కోర్టులో కేసు దాఖలు చేశారు.
More Stories
‘స్వర్ణాంధ్ర విజన్’ సాకారానికి సహకరించండి
నీట్ పేపర్ లీకేజ్‌లో 144 మందికి ప్రశ్నాపత్రం
భారత్ భద్రతను దెబ్బతీసేలా వ్యవహరించం