రాజ్ భవన్ లో 48 మందికి కరోనా 

హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో కరోనా వైరస్ కలకలం రేపుతున్నది. అక్కడ పనిచేస్తున్న 28 మంది భద్రతా సిబ్బందికి, మరో 20 మంది రాజ్‌భవన్‌లో పనిచేస్తున్న సిబ్బందికి, వారి కుటుంబసభ్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 

మొత్తం 395 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 347 మందికి నెగెటివ్‌గా వచ్చిందని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన 28 పోలీసు సిబ్బందిని ఐసోలేషన్ వార్డుకు, మిగతా 20 మందిని ఎర్రగడ్డలోని ఆయుర్వేద ఆస్పత్రికి తదుపరి చికిత్స నిమిత్తం తరలించినట్టు రాజ్‌భవన్ వర్గాలు పేర్కొన్నాయి.

ఈ నేపథ్యంలోనే రాష్ట్ర గవరానర్ తమిళిసై సౌందరరాజన్ తో పాటు పలువురు సీనియర్ అధికారులు కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. వారందరికీ ఫలితాల్లో నెగెటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 

 
ఈ విషయమై గవర్నర్ స్పందిస్తూ తాను కరోనా పరీక్షలు చేయించుకున్నానని, మిగతా వారు చేయించుకోవాలని ఆమె సూచించారు. రెడ్‌జోన్‌లో ఉన్న వ్యక్తులు, వారికి కాంటాక్ట్‌లో ఉన్న వారు దయచేసి ముందస్తుగానే పరీక్షలు చేయించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. 
 
ముందస్తు రోగ నిర్ధారణ పరీక్షలు మనల్ని రక్షించడమే కాకుండా ఇతరులను కూడా రక్షిస్తాయని ఆమె పేర్కొన్నారు. పరీక్షలు చేయించుకోవడానికి ఎవరూ సంకోచించవద్దని ఆమె హితవు చెప్పారు. నాలుగు టీ (టెస్ట్, ట్రేస్, ట్రీట్, టీచ్)లను పాటించాలని ఆమె సూచించారు.