ఐశ్వర్యారాయ్‌‌, ఆరాధ్యలకూ కరోనా 

ఐశ్వర్యారాయ్‌‌, ఆరాధ్యలకూ కరోనా 
బిగ్‌బీ అమితాబ్‌ కుటుంభంలో ఒక్కొక్కరిగా ఇంటి సభ్యులు కరోనా పాజిటివ్‌గా తేలుతున్నారు. శనివారం అమితాబ్‌కు వైరస్ పాజిటివ్‌గా రాగా, ఆ తర్వాత ఆయన తనయుడు అభిషేక్‌కు కరోనా సోకినట్లుగా తేలింది. 
 
తాజాగా అభిషేక్ భార్య, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్‌కు, కూతురు ఆరాధ్యకు పాజిటివ్‌గా తేలింది. ఐశ్వర్య, ఆరాధ్యకు పాజిటివ్‌గా వచ్చిన విషయాన్ని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి  రాజేశ్ తోపే నిర్ధారించారు. 
 
 కాగా అమితాబ్ భార్య జయా బచ్చన్‌కు నెగిటివ్‌గా వచ్చినప్పటికీ ఆమెకు మరోమారు పరీక్షలు చేయాలని నిర్ణయించారు. అమితాబ్ ఇంటి పరిసరాలను శానిటైజ్ చేసిన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బిగ్‌బీ ఇంటి పరిసర ప్రదేశాలను కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించింది. 
 
ఆ ఇంటికి వెళ్లడానికి ఎవరినీ అనుమతించడంలేదు. ముంబై పోలీసులు అక్కడ బారికేడ్లు పెట్టి మోహరించారు. కేవలం అవసరమైన వస్తువులను మాత్రమే బిగ్‌బీ హౌస్‌కి అనుమతీస్తున్నారు.
 

మ‌రో ప్రముఖ బాలీవుడ్ న‌టుడు ‌అనుపమ్ ఖేర్ కుటుంబసభ్యుల్లో నలుగురికి కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని స్వయంగా అనుపమ్ ఖేర్ ట్వీట్ ద్వారా వెల్లడించారు. అనుపమ్ ఖేర్ తల్లి, తమ్ముడు, మరదలు, మేనకోడలికి కరోనా పాజిటివ్ గా తేలినట్టు, తనకు మాత్రం రిపోర్ట్ నెగెటివ్‌గా వచ్చిందని అనుపమ్ ట్వీట్ చేశారు.

ప్రస్తుతం తామంతా హోమ్ క్వారెంటైన్‌లో ఉన్నామని, తమ్ముడి ఇంటిని శానిటైజ్ చేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. కరోనా వైరస్ బారిన పడిన తల్లి దులారిను ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చేర్చినట్టు అనుపమ్ వెల్లడించారు.