పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్ట్‌లో జరగవచ్చని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. సమావేశాల నిర్వహణకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. ‘వర్షాకాల సమావేశాలు తప్పనిసరిగా జరుగుతాయి..నిబంధనలకు అనుగుణంగా అన్ని ముందస్తు జాగ్రత్తల’ను చేపడతామని మంత్రి స్పష్టం చేశారు.
ఆగస్ట్ రెండో వారంలో కాని, మూడో వారంలో కాని వర్షాకాల సమావేశాలు జరగవచ్చని పార్లమెంట్ ప్రతినిధి ఒకరు తెలిపారు. పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ (సిసిపిఎ) సమావేశం అనంతరం ఉభయసభల పనితీరుపై తుది నిర్ణయం తీసుకోవచ్చని చెప్పారు.
ఆరు నెలల్లోగా పార్లమెంటు సమావేశాలు నిర్వహించాల్సిన రాజ్యాంగ విధి కేంద్రానికి ఉందని, ప్రభుత్వం తప్పని సరిగా తన బాధ్యతను నెరవేరుస్తుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు.
కరోనా వ్యాప్తి జరక్కుండా పార్లమెంటు సమావేశాల నిర్వహణకు అనుసరించాల్సిన మార్గదర్శకాలపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు మధ్య ఒక సమావేశం కూడా జరిగినట్టు మేఘ్వాల్ తెలిపారు. ఎనిమిదికి పైగా నిబంధనలకు రూపొందించారని, త్వరలోనే వాటిని జారీ చేస్తారని చెప్పారు.
మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటించడం, చేతులను శానిటైజ్ చేసుకోవడం వంటి పలు నిబంధనలు తప్పనిసరని అన్నారు. ఇప్పటికే తగిన సన్నాహకాలు జరుగుతున్నందున త్వరలేనే పార్లమెంటు సమావేశాలు జరగుతాయని కేంద్ర మంత్రి చెప్పారు.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో.. రాజ్యసభ, లోక్‌సభ సమావేశాలను ఏవిధంగా నిర్వహించాలనేది అతిపెద్ద సవాలుగా మారింది. భౌతిక దూరం పాటించాలన్న నిబంధనను అనుసరించి ప్రభుత్వ సెంట్రల్ హాల్‌లో లోక్‌సభ కార్యకలాపాలను, అలాగే లోక్‌సభ హాలులో ఎగువ సభ కార్యకలాపాలను కొనసాగించాలని భావిస్తున్నారు.
మరోవైపు వర్చువల సెషన్ నిర్వహించే అంశంపై కూడా చర్చలు జరుగుతున్నట్లు సంబంధిత ప్రతినిధి ఒకరు తెలిపారు.
More Stories
వేదాలు భౌతిక, ఆధ్యాత్మిక జ్ఞానపు నిధి
బెంగాల్ పోలీసుల నిర్లక్ష్యంతో కీలక ఆధారాలు నాశనం
మోదీ పుట్టిన రోజుకు బిజెపి కార్యకర్తలకు `ప్రజాస్వామ్య తోఫా’