ఫ్రాన్స్ మీదుగా ఇతర దేశాలకు ప్రయాణించే భారతీయులకు ఇక నుంచి ఎయిర్‌పోర్ట్ ట్రాన్సిట్ వీసా అవసరం లేదని ప్రకటించింది. ఈ కొత్త నిబంధన ఏప్రిల్ 10వ తేదీ నుంచే అమల్లోకి వచ్చిందని భారత్‌లోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో స్పష్టంచేసింది. ఈ కొత్త నిబంధన వల్ల పారిస్ వంటి ప్రధాన నగరాల మీదుగా ప్రయాణించే వారికి ఎంతో ఉపశమనం లభిస్తుంది. సమయం ఆదా అవ్వడమే కాకుండా వీసా కోసం పెట్టే అదనపు ఖర్చులు కూడా తప్పుతాయి.
ఈ కొత్త నిబంధన ప్రకారం సాధారణ పాస్‌పోర్ట్ ఉన్న భారతీయ పౌరులు ఫ్రాన్స్‌లోని విమానాశ్రయాల్లో వేచి ఉండి, అక్కడి నుంచి మూడో దేశానికి వెళ్లేటప్పుడు ట్రాన్సిట్ వీసా మినహాయింపు వర్తిస్తుంది. అయితే ప్రయాణికులు విమానాశ్రయంలోని అంతర్జాతీయ జోన్ దాటి బయటకు రాకూడదు.
“2026 ఏప్రిల్ 10 నుంచి సాధారణ పాస్‌పోర్ట్ కలిగిన భారతీయ పౌరులు ఫ్రాన్స్ భూభాగంలోని విమానాశ్రయాల అంతర్జాతీయ జోన్ గుండా ప్రయాణించేటప్పుడు ఇకపై విమానాశ్రయ ట్రాన్సిట్ వీసా కలిగి ఉండాల్సిన అవసరం లేదు. మూడో దేశానికి వెళ్లే మార్గంలో ఫ్రాన్స్ విమానాశ్రయంలో లేఓవర్ సమయంలో అంతర్జాతీయ జోన్‌లో ఉండే ప్రయాణికులకు ఈ చర్య వర్తిస్తుంది.” అని భారత్ లోని ఫ్రాన్స్ ఎంబసీ ప్రకటనలో పేర్కొంది.
విమానాశ్రయం బయటకు వచ్చి ఫ్రెంచ్ ఇమ్మిగ్రేషన్‌లోకి ప్రవేశించడానికి వీలుండదు. కేవలం లేఓవర్ సమయంలో ఎయిర్‌పోర్ట్‌లో ఉండే వారికి మాత్రమే ఈ సౌలభ్యం అందుబాటులో ఉంటుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారత పర్యటన సందర్భంగా భారతీయులకు ప్రయాణ నిబంధనలు సులభతరం చేస్తామని హామీ ఇచ్చారు.
ఆ హామీకి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 9న ఫ్రాన్స్ అధికారిక గెజిట్‌లో ఇందుకు సంబంధించిన సవరణ ఉత్తర్వులను ప్రచురించారు. ఈ మార్పులకు అనుగుణంగా అధికారిక ఫ్రాన్స్-వీసాస్ ప్లాట్‌ఫామ్‌లో సమాచారాన్ని కూడా అప్‌డేట్ చేసినట్టు రాయబార కార్యాలయం తెలిపింది. ఈ నిర్ణయంతో ఫ్రాన్స్ మీదుగా యూరప్, అమెరికా వంటి దేశాలకు వెళ్లే వేలాది మంది భారతీయులకు ప్రయాణం మరింత సులభతరం కానుంది.
ఫ్రాన్స్ విమానాశ్రయాల గుండా ప్రయాణించే భారత పౌరులకు వీసా రహిత రవాణా సౌకర్యాన్ని అమలులోకి తీసుకురావడాన్ని భారత్ స్వాగతించింది. ట్రాన్సిట్ వీసా విషయంలో ఫ్రాన్స్ తీసుకున్న ఈ నిర్ణయం భారత్, ఫ్రాన్స్‌ల మధ్య ఉన్న శాశ్వత భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుందని రణ్‌ధీర్ జైస్వాల్ తెలిపారు. ఈ నిర్ణయం ప్రజల సులభతర రాకపోకలకు మరింత సౌకర్యం కల్పిస్తుందని చెప్పారు. ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

More Stories
ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాల ధరలతో ‘విద్యా వివక్ష’
హిమాచల్ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాల్లో భారీ కోత
బెంగాల్ లో 91 శాతం, తమిళ్ నాడులో 84 శాతం భారీగా పోలింగ్