ఆర్థిక పొదుపు విధానం దిశగా అడుగులు వేస్తున్న హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి, క్యాబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలను ఆరు నెలల పాటు తాత్కాలికంగా వాయిదా వేస్తూ అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో వీటిని ప్రకటించిన ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అసాధారణమైన ఆర్థిక సవాళ్లతో కూడుకున్నదని అభివర్ణించారు.
అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ముఖ్యమంత్రి జీతంలో 50% , డిప్యూటీ సీఎం, క్యాబినెట్ మంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ల వేతనంలో 30%, మిగిలిన ఎమ్మెల్యేలందరికీ 20%గా నిర్ణయించారు. ఏప్రిల్ 2026 నుంచి ఆరు నెలల పాటు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని, ఆర్థిక క్రమశిక్షణే తమ లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజా ప్రతినిధులతో పాటు ఉన్నతాధికారుల వేతనాల్లో 30 శాతం, మధ్యస్థాయి అధికారులకు 20 శాతం తగ్గింపు ఉంటుందని పేర్కొంది.
అయితే, కేంద్ర సాయంపై ఆధారపడటాన్ని రాష్ట్రాలు తగ్గించుకోవాలని, జీతాలు, పెన్షన్ల వంటి అధిక వ్యయాలను అరికట్టాలని పేర్కొంటూ 16వ ఆర్థిక సంఘం ఈ సాధారణ గ్రాంట్లను నిలిపివేయాలని సూచించింది. దీంతో హిమాచల్ ప్రదేశ్‌కు ఏటా కేంద్రం నుంచి అందే రూ.8,000 కోట్లు నిలిచిపోయాయి. ఇప్పటికే రూ. లక్ష కోట్లకు పైగా అప్పుల భారంతో ఉన్న ఆ రాష్ట్రానికి ఇది భారీ ఎదురు దెబ్బగా పరిణమించింది.
కాగా, ఆర్థిక పరిస్థితి గాడిలో పడిన తర్వాత ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని, ఈ చర్యలు తాత్కాలికమేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, చట్టబద్ధమైన బాధ్యతలు యథావిధిగా కొనసాగుతాయి. ఎందుకంటే ఆదాయపు పన్ను, ఇతర కోతలు పూర్తి వేతనం మొత్తం ఆధారంగానే లెక్కిస్తారు.

More Stories
ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాల ధరలతో ‘విద్యా వివక్ష’
ఫ్రాన్స్ మీదుగా భారతీయులకు ట్రాన్సిట్ వీసా అవసరం లేదు
బెంగాల్ లో 91 శాతం, తమిళ్ నాడులో 84 శాతం భారీగా పోలింగ్