అమితాబ్, అభిషేక్ లకు కరోనా 

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌, బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ (77)కు కరోనా వైరస్‌ సోకింది. ఆయన కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌ కూడా కొవిడ్‌ బారిన పడ్డారు. ముంబైలోని నానావతి దవాఖానలో వారికి చికిత్స అందిస్తున్నారు. 

‘నాకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. నా కుటుంబసభ్యులు, ఉద్యోగులకు కూడా పరీక్షలు నిర్వహించారు. ఫలితాలు తెలియాల్సి ఉంది. పదిరోజులుగా నాతో మెలిగినవారు కరోనా పరీక్షలు చేయించుకోండి’ అని శనివారం రాత్రి అమితాబ్‌ ట్వీట్‌ చేశారు. తాను బాగానే ఉన్నానని తెలిపారు. 

‘శనివారం ఉదయం నాకు, నాన్నకు కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించారు. ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. ఓ మోస్తరు కరోనా లక్షణాలు ఉన్నందున దవాఖానలో చేరాము. ఎవరూ ఆందోళన పడకండి’ అని అభిషేక్‌ ట్వీట్‌ చేశారు. అమితాబ్‌కు కిడ్నీ సమస్యతోపాటు పలు ఆరోగ్యసమస్యలు ఉన్నట్టు సమాచారం. 

టీవీ క్విజ్‌ ప్రోగ్రాం కౌన్‌బనేగా కరోడ్‌పతి ప్రమోషన్‌ షూటింగ్‌లో ఇటీవలే అమితాబ్‌ పాల్గొన్నారు. తన ఇంట్లోనే జరిగిన ఈ షూటింగ్‌ సందర్భంగా ప్రోగ్రాం టీం ఆయనతో సన్నిహితంగా మెలిగింది. శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు తలెత్తటంతో అమితాబ్‌ శనివారం సాయంత్రం దవాఖానలో చేరారని ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు.

అమితాబ్‌కు సాధారణ చికిత్సే అందిస్తున్నామని, వెంటిలేటర్‌ అమర్చలేదని వెల్లడించారు.‘బిగ్‌బీకి సంబంధించి రెండు అంశాల్లో ఆందోళన ఉన్నది. ఒకటి కాలేయ సమస్య, రెండు ఉదర సమస్య. ఇటీవలికాలంలో ఆయన ఈ రెండు సమస్యతో బాధపడుతున్నారు’ అని వైద్యులు తెలిపారు.

అమితాబ్ చికిత్స‌కి సానుకూలంగా స్పందిస్తున్నారని, భ‌య‌ప‌డాల్సిందే ఏమి లేదుని, రాత్రి ఆయ‌న  ప్ర‌శాంతంగా నిద్ర పోయార‌ని నానావ‌తి ఆసుప‌త్రికి చెందిన వైద్యుడు డాక్ట‌ర్ అన్సారీ ఆదివారం ఉదయం తెలిపారు.