గతంలో మనదేశంలో తగ్గిన పులుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతున్నది. దేశంలో కెమెరా సాయంతో అడవులలో 2018లో నిర్వహించిన పులుల జనాభా గణన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. అఖిల భారత పులుల అంచనా 2018 ప్రకారం దేశంలో 2,967 పులులు లేదా ప్రపంచ పులుల జనాభాలో 75 శాతం మన దేశంలోనే ఉన్నాయి.
పులలకు సంబంధించిన ఫొటోలను సైతం సేకరించిన అటవీశాఖ అధికారులు 76,000 పులులు, 51వేల అడవి పిల్లులు, చిరుత పులుల ఫోటోలను తీసి రికార్డు నెలకొల్పారు. అటవీ అధికారులు, వన్యప్రాణి సంరక్షణ నిపుణులు దాదాపు 139 స్టడీ సైట్లలో 26,760 వేర్వేరు ప్రదేశాలలో కెమెరాలను అమర్చారు. ఇక, ఈ ప్రాంతాల్లో తీసిన 35 మిలియన్ ఫోటోలను పరిశీలించిన తర్వాత పులుల సంఖ్యపై ఓ అంచనాకు వచ్చారు.
ఈ ఫొటోల్లో రకరకాల వన్యప్రాణుల అరుదైన చిత్రాలతో పాటు 76,523 పులుల చిత్రాలు, 51,337 చిరుతపులుల ఫోటోలను తీశారు. భారత్‌లో ప్రస్తుతం దాదాపు 3000 పులులు ఉన్నాయని అధికారులు నిర్ధారించారు. 2014లో ఉన్న సంఖ్య కంటే ఇది చాలా ఎక్కువ. ఎందుకంటే 2014లో పులుల సంఖ్య 2,226గా ఉండగా, 2018లో వాటి సంఖ్య 2,967కి చేరింది.
ఇక, పులి పిల్లలను లెక్కలోకి తీసుకోకుండా కేవలం ఎదిగిన పులులను మాత్రమే లెక్కించారు. వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, జాతీయ పులుల సంరక్షణ సంస్థ సంయుక్తంగా పులల సంఖ్యపై నివేదికలు రూపొందించాయి. వాటి ప్రకారం 2006లో భారత్‌లో 1,411 పులులు మాత్రమే ఉండగా, 2014లో 2,226కు పెరిగాయి. ఇక, 2018కి 2,967 చేరాయి. అంటే 8 ఏళ్ళల్లో రెట్టింపుకన్నా ఎక్కువగా పెరిగాయి.
పులుల జనాభా గణన ఫలితాలను ప్రధాని నరేంద్ర మోదీ గత ఏడాది ప్రపంచ పులుల దినోత్సవం నాడు ప్రకటించారు. భారతదేశంలో పులుల జనాభా గణన ప్రక్రియ గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకోవడం పట్ల కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జావదేకర్ హర్షం వ్యక్తం చేశారు.
కెమెరా సాయంతో ప్రపంచంలోనే అతిపెద్ద వన్యప్రాణి జనాభా గణనగా మనదేశం గిన్నిస్ బుక్‌లో స్థానం పొందడం గొప్ప విషయమని, ఇది ఆత్మనిర్భర్ భారత్‌కు ఒక గొప్ప ఉదాహరణని ఆయన పేర్కొన్నారు. తొమ్మిదేళ్ల క్రితం 2020 నాటికి పులుల జనాభాను రెట్టింపు చేయాలను లక్ష్యంగా నాలుగేళ్ల ముందుగానే సంకల్పసిద్ధితో సాధించామని ఆయన చెప్పారు.
ఈ అధ్యయనం అత్యంత విస్తరమైనది కావడంతో లక్ష్యసాధన పట్ల భారత్ ఎంతో గర్వించదగిన అంశమని భారత వన్యప్రాణ సొసైటీ వ్యవస్థాపకురాలు బెలిండా రైట్ పేర్కొన్నారు. అయితే దీర్ఘకాల లక్ష్య సాధనకు మరెంతో కాలం పడుతుందని చెబుతూ మానవులు – పులుల మధ్య ఘర్షణలు పెద్ద సవాల్ వంటివని ఆమె తెలిపారు.
అడవుల సంఖ్య తగ్గిపోతూ ఉండడం, జనాభా సంఖ్య పెరుగుతూ ఉండడంతో వన్యప్రాణులు జనారణ్యంలోకి ప్రవేశిస్తున్నాయని చెబుతూ ప్రతి రోజూ కనీసం ఒకరిని పులులు లేదా ఏనుగుకు హతమారుస్తున్నాయని ఆమె విచారం వ్యక్తం చేశారు.
గిన్నిస్ వరల్డ్ రికార్డు వెబ్‌సైట్ తెలిపిన ప్రకారం 2018-19లో నిర్వహించిన నాలుగవ విడత సర్వే గణాంకాల విషయంలో అత్యంత సమగ్రమైనది. దేశంలోని 141 వేర్వేరు అడవులలో ఏర్పాటు చేసిన 26,838 కెమెరా ట్రాప్‌లు (జంతువు కదలిక మేరకు రికార్డింగ్ మొదలయ్యే మోషన్ సెన్సార్లు అమర్చిన కెమెరాలు) మొత్తం 1,21,337 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కవర్ చేశాయని వెట్‌సైట్ తెలిపింది.
More Stories
సైఫ్ అలీ ఖాన్‌పై దాడిలో అండర్‌వరల్డ్ హస్తం లేదు!
ఇక విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ సమస్య ఉండదు
కర్ణాటకలో పట్టపగలే బ్యాంక్ లో రూ 12 కోట్లు దోపిడీ