బ్యాంకింగ్‌ రంగంలో పెరగనున్న మొండి బకాయిలు  

బ్యాంకింగ్‌ రంగంలో పెరగనున్న మొండి బకాయిలు  

కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ల నేపథ్యంలో బ్యాంకింగ్‌ రంగంలో మొండి బకాయిలు (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పీఏ) పెరుగవచ్చని రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ హెచ్చరించారు. మహమ్మారితో మారిన పరిస్థితులు, రుణాలను ఒత్తిడిలోకి నెట్టాయని తెలిపారు. ఇక దేశ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి ఇంకా తొలగలేదని పేర్కొన్నారు. మధ్య కాలిక దృక్పథం ఇప్పటికీ ఆశాజనకంగా లేదని చెప్పారు. 

శనివారం జరిగిన ఎస్బీఐ 7వ బ్యాంకింగ్‌, ఎకనామిక్స్‌ కన్‌క్లేవ్‌లో మాట్లాడుతూ సన్నగిల్లిన ఆత్మవిశ్వాసం, బలహీనపడ్డ ఆర్థిక స్థిరత్వం, మందగించిన వృద్ధిరేటును బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. కాగా, ఇప్పటికీ సరఫరా వ్యవస్థల్లో ఇబ్బందులున్నాయన్న ఆయన ఇది మునుపటి స్థితికి చేరుకోవాలని చెప్పారు.  మార్కెట్‌లో నెలకొన్న స్తబ్ధత తొలగి, డిమాండ్‌ పుంజుకోవాల్సిన అవసరం చాలా ఉందని చెప్పుకొచ్చారు. 

అయితే ప్రభుత్వం ఇప్పటికే దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి కావాల్సిన అన్ని చర్యలనూ తీసుకున్నదని వివరించారు. కరోనా అనంతర కాలమే ఇప్పుడు ముఖ్యమని, వైరస్‌ సద్దుమణిగాక ఎలా వృద్ధిబాట పట్టాలన్న దానిపై అన్ని రంగాలూ ఆలోచించుకోవాలని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ పురోగతి కోసం తమ వంతుగా వడ్డీరేట్లను తగ్గిస్తున్నామని గుర్తు చేశారు. 

బ్యాంకులు మరింత మూలధనాన్ని సమకూర్చుకోవాలని ఆర్బీఐ గవర్నర్‌ సూచించారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో బ్యాంకింగ్‌ రంగం చాలా ఒత్తిడిని ఎదుర్కొంటున్నదన్న ఆయన మొండి బకాయిల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కాబట్టి బ్యాంకులు ఆర్థికంగా బలంగా ఉంటేనే ఈ సమస్యల్ని అధిగమించవచ్చని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంకులన్నీ కూడా మూలధన సమీకరణపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 

ఒత్తిడిలో ఉన్న ఆర్థిక సంస్థల పునరుద్ధరణ, తీర్మానం కోసం ఓ చట్టపరమైన వ్యవస్థ రావాలని దాస్‌ ఈ సందర్భంగా సూచించారు. నిజానికి ఆగస్టు 2017లో కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌ఆర్డీఐ  బిల్లును పార్లమెంట్‌కు తెచ్చింది. ఇందులో రిజల్యూషన్‌ కార్పొరేషన్‌ కూడా ఉన్నది. అయితే వివాదాస్పద ‘బెయిల్‌-ఇన్‌’ క్లాజ్‌ కారణంగా దీన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ నేపథ్యంలో కార్పొరేషన్‌ ఆవశ్యకతను దాస్‌ వివరిస్తూ  దాని లాభాలు బ్యాంకర్లకు అవసరమని స్పష్టం చేశారు.