ప్రమాదం అంచున రాజస్థాన్ ప్రభుత్వం 

రాజస్థాన్‌లో అశోక్‌ గెహ్లోత్‌ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాదం అంచుల్లోకి దిగుతున్నది. మధ్య ప్రదేశ్ లోని కాంగ్రెస్ కమలనాథ్,  దిగ్విజయ్ సింగ్, జ్యోతిరాదిత్య సింధియాల మధ్య విబేధాలు అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వ పతనంకు దారితీస్తోన్నట్లు ఇప్పుడు రాజస్థాన్ లో ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌, సచిన్ పైలట్ ల మధ్య నెలకొన్న ప్రచ్ఛన్న పోరు ప్రభుత్వ పతనంకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 
పార్టీలోని అంతర్గత కలహాలను కప్పిపుచ్చుకొంటూ తన  సర్కారును కూల్చేందుకు బీజేపీ కుట్రపన్నుతోందని, ఒక్కో ఎమ్మెల్యేను రూ. 15 కోట్లు వెచ్చించి కొనుగోలు చేస్తోందని  అశోక్‌ గెహ్లోత్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే గత నెలలో రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కూడా బిజెపి తమ పార్టీ ఎమ్యెల్యేలకు బేరం పెడుతున్నాడని ఆరోపణలతో కేవలం సచిన్ పైలట్ నుండి కాపాడుకోవడం కోసమే సొంత పార్టీ ఎమ్యెల్యేలను ఒక రిసార్ట్ కు తరలించారు. 
ఎన్నికలకు ముందు నుంచి సీఎం కుర్చీని ఆశించి, కాంగ్రెస్‌ పెద్దల జోక్యంతో డిప్యూటీ సీఎం పదవితో సరిపెట్టుకున్న సచిన్‌ పైలట్‌ ఇప్పుడు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు! ముందు నుంచీ సీఎం గెహ్లోత్‌ తీరుపై అసంతృప్తితో ఉన్న ఆయన వెంట 25 మంది ఎమ్మెల్యేలు ఉండగా శనివారం రాత్రికి రాత్రే ఆయన 16 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రులతో కలిసి ఢిల్లీ చేరారు.
అతని వెంట ఉన్న మరో 9 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఉదయానికల్లా ఢిల్లీ చేరుతారని తెలిసింది. అక్కడ ఐటీసీ హోటల్‌లో శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఏ క్షణాన్నైనా సచిన్‌తో పాటు మిగతా ఎమ్మెల్యేలు బీజేపీలో చేరే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. 
 
200 సీట్లు ఉన్న రాజస్థాన్‌ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్‌ ఫిగర్‌ 101. కాంగ్రెస్‌ అతిపెద్ద పార్టీగా 119 మంది సభ్యులు, సీపీఎంకు చెందిన ఇద్దరు, బీటీపీకి చెందిన ఇద్దరు, ఆర్‌ఎల్‌డికి చెందిన ఒక ఎమ్మెల్యే మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీకి 72 స్థానాలున్నాయి. ముగ్గురు సభ్యులున్న ఆర్‌ఎల్‌పీ మద్దతు కూడా ఆ పార్టీకి ఉంది.
కాగా, అశోక్ గెహ్లాట్ ఆరోప‌ణ‌లు శుద్ధ అబ‌ద్ధ‌మ‌ని బీజేపీ కొట్టిపారేసింది. అశోక్ గెహ్లాట్ ఒక క‌న్నింగ్ పొలిటీషియ‌న్ అని రాజ‌స్థాన్ బీజేపీ అధ్య‌క్షుడు స‌తీష్ పూనియా విమ‌ర్శించారు. త‌న ప‌రిపాల‌నా వైఫ‌ల్యాల‌ను క‌ప్పపుచ్చుకోవ‌డానికి గెహ్లాట్ బీజేపీపై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. నిజానికి ఎవ‌రు రాజ‌స్థాన్ ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు చూస్తున్నారో గెహ్లాట్‌కు తెలుసని పూనియా ఎద్దేవా చేశారు.