చైనా నుంచి వెళ్లనున్న టిక్‌టాక్‌

చైనాకు చెందిన టిక్‌టాక్‌తో సహా 59 యాప్స్‌ని భారత ప్రభుత్వం నిషేదించిన సంగతి విధితమే. దీంతో టిక్‌టాక్‌, హెలో పేరెంట్‌ కంపెనీ అయిన బైట్‌డ్యాన్స్‌ భారీగా నష్టపోతుంది.  భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇతర దేశాల్లో  బైట్‌డ్యాన్స్‌ కార్యకలాపాల పైనా ప్రభావం చూపిస్తోంది.

దీంతో కార్పొరేట్‌ రీస్ట్రక్చరింగ్‌ చేయాలని  బైట్‌డ్యాన్స్‌ భావిస్తోంది. అందులో భాగంగా తమ ప్రధాన కార్యాలయాన్ని చైనా నుంచి తరలించాలని   భావిస్తున్నట్టు తెలుస్తోంది. తమ వ్యాపారాలకు విఘాతం కలుగకుండా చైనాతో అన్ని సంబంధాలు తెంచుకోవాలని  బైట్‌డ్యాన్స్‌ ఆలోచిస్తోంది. 

భారతదేశంలో చైనా వ్యతిరేక సెంటిమెంట్‌ పెరుగిపోతుండటంతో, అమెరికా కూడా టిక్‌టాక్‌ను నిషేధించే దిశగా ఆలోచిస్తుండటం లాంటి పరిణామాల దృష్ట్యా చైనా నుంచి తరలిపోవాలని  బైట్‌డ్యాన్స్‌  భావిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. 

బైట్‌డ్యాన్స్‌కు చెందిన టిక్‌టాక్‌, హెలో ప్లాట్‌ పామ్స్‌ ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడవాలంటే చైనా ముద్రను తొలగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే చైనా నుంచి ప్రధాన కార్యాలయాన్ని ఇతర ప్రాంతానికి తరలించి కొత్త మేనేజ్‌మెంట్‌ బోర్డును ఏర్పాటు చేయాలని బైట్‌డ్యాన్స్‌ భావిస్తోంది.

ఇప్పటికే సీనియర్‌ ఎగ్జిక్యూటీవ్స్‌ ఈ ప్రతిపాదనలపై చర్చిస్తున్నారని సమాచారం. కోట్లాది మంది యూజర్లు, కంపెనీ ఉద్యోగులు, విధాన నిర్ణేతలు, కళాకారులు, కంటెంట్‌ క్రియేటర్స్‌, భాగస్వాముల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కీలక నిర్ణయం తీసుకోవచ్చన్న చర్చ జరుగుతోంది.

ఇలా ఉండగా, భారత్ నిషేధిత పాపులర్ వీడియో షేరింగ్ చైనా యాప్ టిక్‌టాక్‌ను ఫోన్ల నుంచి డిలీట్ చేయాలని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఉద్యోగులను ఆదేశించింది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉద్యోగులకు అమెజాన్ ఈమెయిల్ పంపింది.